సముద్ర తీరంలో పన్ను మోత వాడరేవు వద్ద టోల్‌గేట్ ఏర్పాటు
కారుకు రూ.50, లారీకి రూ.100, టూరిస్ట్ బస్‌కు రూ.200 చొప్పున వసూలు
మత్స్యకారులు, పర్యాటకుల మండిపాటు
చీరాల: పెద్ద ఎత్తున మత్స్య ఎగుమతులతో పాటు పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే బాపట్ల జిల్లాలోని వాడరేవు వద్ద టోల్‌గేట్ పేరుతో కూటమి సర్కారు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తోంది. మినీ గోవాగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంతంలో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. కనువిందు చేసే కడలి సోయగాలను ఆస్వాదించేందుకు రాష్ట్రంతోపాటు తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు.
ఆదాయంపై కన్నేసిన సర్కారు వాడరేవు, కీర్తివారిపాలెం గ్రామాల అభివృద్ధి కోసం టోల్ గేట్ ఏర్పాటు చేసినట్లు చెబుతుండటంపై పర్యాటకులు, మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కీర్తివారిపాలెం వద్ద 2017లో టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ టోల్‌గేట్‌ను ప్రారంభించగా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి దాన్ని తొలగించారు.
తాజాగా కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ టోల్‌గేట్ ఏర్పాటైంది. గ్రామ ప్రజల అభిప్రాయం, పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య స్వయంగా టోల్‌గేట్‌ను ప్రారంభించడం గమనార్హం. తీర ప్రాంతాల్లో గ్రామాల్లో ఎక్కడా టోల్‌గేట్లు ఉండవు. జాతీయ రహదారిల్లో మాత్రమే ఉండే టోల్‌గేట్లు చిన్న గ్రామాల్లోకి రావడంతో జనం విస్తుపోతున్నారు.
వసూళ్లు భారీగానే..
కార్తీక మాసంతో పాటు శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో వాడరేవు పర్యాటకులతో కళకళలాడుతుంది. కీర్తివారిపాలెం టోల్‌గేట్ ద్వారా ఏటా రూ.14 లక్షల ఆదాయం పొందేలా కూటమి నాయకులు స్కెచ్ వేశారు.
కారుకు రూ.50, ట్రాక్టర్‌కు రూ.50, నాలుగు చక్రాల లారీకి రూ.100, వినాయకుడి విగ్రహం ట్రాక్టర్‌కు రూ.100, లారీకి రూ.200, రొయ్యలు, చేపలు రవాణా చేసే వాహనాలకు రూ.100, టూరిస్ట్ బస్‌కు రూ.200 చొప్పున టోల్ చార్జీలు నిర్ణయించి వసూలు చేసేందుకు ముగ్గురు సిబ్బందిని నియమించారు. టోల్‌గేట్ 24 గంటలు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు చెబుతున్నట్లు సంపద సృష్టించడం అంటే ఇదేనా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డీపీవో ఆదేశాలతో ఏర్పాటు
పర్యాటకులు అధికంగా వచ్చే వాడరేవులోని కీర్తివారిపాలెంలో గ్రామ పంచాయతీ తీర్మానం, డీపీవో ఆదేశాలతో టోల్‌గేట్ ఏర్పాటు చేశారు. డీపీవో ఉత్తర్వుల్లో ఏముందో తెలుసుకుంటాం. – పి.శ్రీనివాసరావు, ఇన్‌చార్జి ఎంపీడీవో, చీరాల
పర్యాటకం వెలవెల..
వాడరేవు నుంచి కఠారిపాలెం వరకు తీరప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏపీతోపాటు తెలంగాణ, ఇతర‡ప్రాంతాల నుంచి కూడా సేద తీరేందుకు పర్యాటకులు వస్తుంటారు.
గతంలో కూడా ఈ టోల్ గేట్‌ను అక్రమంగా ప్రారంభిస్తే మేం అధికారంలో ఉన్నప్పుడు తొలగించాం. మత్స్య సంపదను లారీలు, ఆటోల్లో ఇతర ప్రాంతాలకు తరలించే వారి వద్ద రూ.100 ట్యాక్స్ వసూలు చేయడం దారుణం. టోల్‌గేట్ తొలగించి ప్రజలపై భారం పడకుండా చూడాలి. లేదంటే పర్యాటకం కళ తప్పే ప్రమాదం ఉంది. – కరణం వెంకటేష్, వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి చీరాల
Comments
Please login to add a commentAdd a comment