బోయ రత్నాకరుడే.. మహర్షి వాల్మీకి  | Valmiki Jayanti Celebrations Today | Sakshi
Sakshi News home page

బోయ రత్నాకరుడే.. మహర్షి వాల్మీకి 

Published Sun, Oct 13 2019 10:03 AM | Last Updated on Sun, Oct 13 2019 10:03 AM

Valmiki Jayanti Celebrations Today - Sakshi

త్రేతాయుగంలో గంగా తీరంలోని నైమిషారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని నిష్టతో తపస్సు చేస్తుండేవాళ్లు. వీరిలో ప్రచస్థాముడు అనే ముని కుమారుడు రత్నాకరుడు. ఒకరోజు అడవిలో ఆడుకుంటూ దారితప్పి ఎటుపోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుడిని అటుగా వెళ్తున్న ప్రయాణిస్తున్న ఓ వేటగాడు గమనించాడు. ఆ ముని కుమారుడిని ఓదార్చి తనతో పాటు తీసుకెళ్లిన బోయవాడు తన కుమారునిగా పెంచుకుంటాడు. తన కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారినో పడి మరణించి ఉంటాడని ప్రచస్థాముడు భావిస్తాడు. బోయవారి ఇంట పెరిగిన రత్నాకరుడు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. యుక్త వయస్సుకు వచ్చిన రత్నాకరుడికి ఓ యువతితో వివాహమవుతుంది. వీరికి ముగ్గురు సంతానం. వీరితోపాటు తల్లిదండ్రులను పోషించడానికి సంపాదన చాలక దారి దోపిడీలు, దొంగతనాలను వృత్తిగా చేసుకుని కొన్ని సందర్భాల్లో బాటసారులను చంపడానికి వెనుకాడని పరిస్థితికి చేరుకుంటాడు రత్నాకరుడు. అడవిలో బాటసారుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నారద మహర్షి ఓ సాధారణ మనిషి రూపంలో ఆ దారి వెంట వస్తాడు. ఆయనను దోచుకోడానికి రత్నాకరుడు ప్రయత్నంచగా.. తన వద్ద వీణ, రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవన్నా వినిపించుకోకుండా చంపుతానంటూ భయపెడుతాడు. నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరికోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించగా తన కుటుంబం కోసమని రత్నాకరుడు బదులిస్తాడు.  

పోషణ కోసం తెలిసిన విద్య ఇది ఒక్కటే. పాప పుణ్యాలు నాకు తెలియవని అంటాడు. రత్నాకరుడికి జ్ఞానోదయం కలిగించేందుకు నారదుడు ఓ ఉపాయం పన్నుతాడు. ఓ బోయవాడా.. నీవు చేసే ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారేమో అడిగి తెలుసుకోమని తనతో పాటు ఇంటికి వెళ్తాడు. తన పాపాల్లో మీరూ కూడా భాగస్వాములే కదా అని తల్లిదండ్రులు, భార్యా బిడ్డలను ప్రశ్నించగా, అందుకు వారు సమ్మతించరు. పైగా కుటుంబ పోషణ ఇంటి యజమాని బాధ్యత.. పాప, పుణ్యాలు ఒకరి నుంచి ఇంకొరికి ఇవ్వలేం, తీసుకోలేమని బదులిస్తారు. వారి మాటలతో పశ్చాత్తాపం చెందిన రత్నాకరుడు పాపవిముక్తి కలిగించాలని నారదుని వేడుకుంటాడు. అప్పుడు నారదుడు తన నిజస్వరూపాన్ని చూపి భక్తి మార్గానికి ‘రామ.. రామ‘ అనే రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అప్పటి నుంచి నైమిషారణ్యంలో రామ మంత్రాన్ని జపిస్తూ కొన్నేళ్లు తపస్సు చేస్తాడు. తపస్సులో కూర్చున్న రత్నాకరుడి చుట్టూ పుట్టలు వెలుస్తాయి. అలా కొనేళ్లు గడిచిన తర్వాత పుట్టలో బక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని రత్నాకరుని చెవిలో రామ.. రామ.. రామ.. అని నారదుడు మూడుసార్లు పలుకుతాడు. 

ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వస్తాడు. ‘‘రత్నాకరా.. నీవు గొప్ప తపశ్సాలివి అయ్యావు. దేవుడు నిన్ను కరుణిచాడు. నీవు మళ్లీ జన్మించావు. ఈ పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కల్యాణం కోసం ఓ గొప్ప కావ్యాన్ని రాస్తావు’’ అని దీవించి నారదుడు అదృశ్యమవుతాడు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణ సంకలనం చేస్తాడు. సంస్కృతంలో రాసిన మొదటి కావ్యం కావడంతో రామయాణాన్ని ఆదికావ్యం అంటారు. ఇకపోతే వాల్మీకి మొదటి శిష్యులు రాముడి కుమారులైన లవకుశలు. 

నేడు రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు 
అనంతపురం: మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలు ఆదివారం అనంతపురంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.ఇందుకోసం రూ.19లక్ష లు కేటాయించగా..ఇతరజిల్లాలకు రూ.55 వేలు చొప్పున మంజూరు చేశారు. మం త్రులు శంకరనారాయణ, గుమ్మనూరు జయరాం, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, రెడ్డెప్ప, డాక్టర్‌ సంజీవకుమార్, పి.బ్రహ్మానందరెడ్డితో పాటు పలు వురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానంలో ఉదయం 10 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బీసీ ఫెడరేషన్, కార్పొరేషన్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వాల్మీకులు ఎక్కువగా ఉన్న జిల్లాను గుర్తిం చి రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించడం పట్ల ఆ వర్గీయులు గర్వపడుతున్నారు.   

రామాయణంతోనే కుటుంబ వ్యవస్థ పటిష్టం 
భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉందంటే అది రామాయణంతోనే. పితృవాక్య పరిపాలన. ఒకే భార్య, ఒక బాణం, ఒకే మాట అనేది రామాయణం నుంచి వచ్చిం దే. అలాంటి ఆది కావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలకు అనంతపురం వేదిక కావడం సంతోషదాయకం. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. బీసీల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలుస్తారు. 
– తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement