సాక్షి, హైదరాబాద్: వంశధార ప్రాజెక్టు రెండో దశ పనుల టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నిర్ణయించిన ధరలతో పనులు చేయడానికి ప్రస్తుత కాంట్రాక్టర్ సుముఖంగా లేకపోవడంతో తాజాగా మరోసారి టెండర్లు ఆహ్వానించనుంది. వంశధార రెండవ దశలో భాగంగా నదికి కుడివైపున శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ వద్ద సుమారు 300 మీటర్ల మేర కరకట్టను తొలగించి దాని స్థానంలో తక్కువ ఎత్తుతో కూడిన గోడవంటి నిర్మాణాన్ని (సైడ్‌వీర్) నిర్మిస్తారు.
అక్కడినుంచి హీరమండలం రిజర్వాయర్ వరకు నీటిని తరలించాల్సి ఉంది. నదిలో ప్రవాహం ఎక్కువైనప్పుడు సైడ్‌వీర్ ద్వారా నీరు రాష్ట్ర భూభాగంలోకి వస్తుంది. ఇలా వచ్చే నీటిని సైడ్‌వీర్‌కు ఇరువైపులా నిర్మించే కట్టలు, ఎదురుగా కొంత దూరంలో నిర్మించే రెగ్యులేటర్ ద్వారా నిల్వ చేస్తారు. అక్కడినుంచి 34 కిలో మీటర్ల మేర తవ్వే కాలువ ద్వారా హీరమండలం రిజర్వాయర్‌లోకి తీసుకువెళతారు. సుమారు 8 వేల క్యూసెక్కుల సామర్థ్యం మేరకు ఈ కాల్వను తవ్వాల్సి ఉంది.
ఈ పనులన్నిటికీ టెండర్లు గతంలోనే ఖరారయ్యాయి. అయితే ఒడిశా వ్యతిరేకత నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పడగా.. ప్రాజెక్టు పనుల్ని చేసుకోవడానికి ట్రిబ్యునల్ రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది. అయితే ప్రస్తుతం ధరలు పెరిగిపోవడంతో పాత ధరలతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
వంశధార-2కు మళ్లీ టెండర్
Published Sat, Jan 18 2014 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement
Advertisement