యువకుడిని దుర్భాషలాడుతున్న వర్ల రామయ్య
సాక్షి, మచిలీపట్నం/అమరావతి: ఆర్టీసీ బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య కులం పేరుతో దూషించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడున్న అధికారులు, టీడీపీ నేతలు అవాక్కయ్యారు. ఈ ఘటన గురువారం కృష్ణాజిల్లా మచిలీపట్నం బస్టాండ్ అవరణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా మచిలీపట్నం బస్టాండ్ తనిఖీ నిమిత్తం వచ్చిన వర్ల రామయ్య అక్కడ ఆగిఉన్న బస్సు వద్దకు వెళ్లారు.
ఆ సమయంలో ఓ యువకుడు బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెల్‌ఫోన్‌లో పాటలు వింటున్నాడు. తనను చూసి సీటులో నుంచి లేవలేదని అనుకున్నారో ఏమో.. ఇయర్ ఫోన్స్ లాక్కుని తన చెవికి పెట్టుకున్నారు. అనంతరం తన నోటికి పనిచెప్పారు. రాయలేని విధంగా దుర్భాషలాడారు. ‘‘నీకు ఫోన్ ఎందుకురా? ఎస్సీనా నువ్వు?.. మాలా? మాదిగా?’’ అని నిలదీశారు. తాను మాదిగనని ఆ యువకుడు బదులివ్వగా.. వర్ల మరింత రెచ్చిపోయారు. ‘‘మాదిగ (నా.. కొ..) అస్సలు చదవరు. బాగుపడరు’’.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆగకుండా.. ‘‘మీ నాన్న, మీ అమ్మ ఏం పనిచేస్తారు? ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎన్ని లక్షలు ఉన్నాయి బ్యాంకులో?’’ అంటూ అసంబద్ధ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, ఆర్టీసీ అధికారులుఅవాక్కయ్యారు. ఆర్టీసీ అధికారుల పనితీరు, బస్టాండ్‌లో సౌకర్యాలపై తనిఖీ చేయాల్సి వర్ల రామయ్యకు ప్రయాణికులను దుర్భాషలాడాల్సి అవసరం ఏంటని విమర్శలు వ్యక్తమయ్యాయి.
కులం పేరుతో దూషించడం దుర్మార్గం
మచిలీపట్నం బస్టాండ్‌లో దళితులను, ప్రయాణికులను అవమానపరుస్తూ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడటం సిగ్గుచేటని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. మాదిగోళ్లకు చదువు సంధ్యలు ఉండవు.. వీరికి సెల్‌ఫోన్లు కావాలి అని మాట్లాడటం ఆయన స్థాయికి తగదన్నారు.
దళిత కులంలో పుట్టి అదే దళితులను అవమానపరుస్తూ రామయ్య మాట్లాడటం దుర్మార్గమని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మార్కెటింగ్ శాఖ మంత్రి తదితరులు సైతం దళితులను కించపరిచేలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు.
మార్చి నాటికి అంబేడ్కర్ స్మృతివనం
ఇదిలా ఉంటే.. అమరావతిలో 2019 మార్చి నాటికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామని, ఇప్పటికే ఆ బాధ్యతను ఏపీఐఐసీ ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీకి అప్పగించామని ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు.
స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్మృతివనం ప్రాజెక్టును రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో చేపట్టనున్నామని, ఇందుకు సంబంధించిన డిజైన్ సైతం ఖరారు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment