
బాబుది నయామోసం: వాసిరెడ్డి పద్మ
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఢిల్లీ కాంగ్రెస్ సూచన మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నయా మోసానికి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకే చంద్రబాబు వంద రోజుల్లో ఎన్నికలంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వంద రోజులుగా ఉద్యమిస్తున్న ప్రజలను గందరగోళపరుస్తున్నారని ధ్వజమెత్తారు. 2009 తర్వాత ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్కటీ గెలవకపోగా డిపాజిట్లు కోల్పోయిన టీడీపీ, వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని చంద్రబాబు చెప్పడం చూస్తే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. ఐఎంజీ భారత కేసులో విచారణ జరిగితే ఊచలు లెక్కించాల్సి వస్తుందని భయపడిన చంద్రబాబు.. సోనియాముందు మోకరిల్లారని చెప్పారు. అందుకే విభజనలో కాంగ్రెస్‌కు అండదండలందిస్తున్నారని తెలిపారు. సోనియా సూచనల మేరకే చంద్రబాబు, వారి గ్యాంగ్ తమ పార్టీ అధినేత జగన్‌పై దుష్ర్పచారం చేస్తున్నారని ఆమె తప్పుబట్టారు.