
రుణమాఫీపై అబద్ధాలు చెప్పిస్తున్నారు : వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాల మాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతాను మాయ మాటలు చెబుతున్నది చాలక అధికారులతో కూడా అబద్ధాలాడిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు పాల్గొన్న తిరుపతి సభలో పురుషోత్తం అనే రైతుకు రూ.29,999ల మేరకు మాత్రమే రుణం రద్దయితే ఆయన చేత తనకు రూ.లక్షన్నర రుణం మాఫీ అయిందని చెప్పిం చారని గుర్తు చేశారు. అలా ఎలా చెప్పారని ఆ రైతును ప్రశ్నిస్తే... అధికారులే చెప్పమన్నారని ఆ రైతు బదులిచ్చారని తెలిపారు.
నిజాయితీపరులైన అధికారులతో సైతం చంద్రబాబు తనకు అనుకూలంగా అబద్ధాలాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ జరక్కుండానే జరిగినట్లుగా చంద్రబాబు రైతుల చేతుల్లో పెడుతున్న సర్టిఫికెట్ల తీరు చూస్తే ఇపుడు టికెట్లు ఇచ్చి నాలుగేళ్ల తరువాత భోజనం పెట్టిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. రుణమాఫీకి కూడా ఆధార్ కార్డును వర్తిం పజేస్తున్న ఫలితంగా ఆంధ్రా ప్రాంతంలో పొలాలు ఉన్న ఆడపడుచులు గాని, మరొకరు గాని హైదరాబాద్‌లో కాపురం ఉంటే వారికి రుణమాఫీ లేద ని చెబుతున్నారని తెలిపారు. పెళ్లయిన ఒక ఆడపడుచుకు తన తల్లిదండ్రుల నుంచి పసుపుకుంకుమల కింద సంక్రమించిన పొలానికి, ఆమె భర్తతో హైదరాబాద్‌లో ఉన్న కారణం చూపి రుణమాఫీ లేదనడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.