చంద్రబాబు రోజాకు క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. నగరి ఎమ్మెల్యే రోజాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు బేషరతుగా రోజాకు క్షమాపణలు చెప్పాలని పద్మ డిమాండ్ చేశారు. రోజాపై దాడి టీడీపీ అరాచకాలకు పరాకాష్టని అన్నారు. చంద్రబాబు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని, ఇలాగే వ్యవహరిస్తే పోలీసులు, న్యాయవ్యవస్థ ఎందుకని పద్మ ప్రశ్నించారు.
రోజాపై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. నగరిలో రోజాకు మద్దతుగా శనివారం వైఎస్ఆర్ సీపీ నాయకులు ధర్నాకు దిగారు. తిరుపతి వరప్రసాద్, పార్టీ ఎమ్మెల్యేలు, భూమన కరుణాకర్ రెడ్డి నిరసన తెలిపారు. టీడీపీకి కొమ్ముకాస్తున్న డీఎస్పీని సస్పెండ్ చేయాలని, రోజాపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని భూమన డిమాండ్ చేశారు.