ట‘మోత’
సాక్షి, అనంతపురం/కళ్యాణదుర్గం : నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత టమాట రైతులకు మంచి రోజులొచ్చాయి. ధర బాగా పలుకుతుండటంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. ఇదే తరుణంలో వినియోగదారులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలోనే కళ్యాణదుర్గం డివిజన్‌లో టమాటను ఎక్కువగా పండిస్తారు. అక్కడి రైతులు రెండేళ్లుగా తీరని నష్టా లను చవిచూశారు. 25 రోజుల క్రితం వరకూ గిట్టుబాటు ధర లభించలేదు. దీనివల్ల వేలాది ఎకరాల్లో పంటను తొలగించారు. జూన్ చివరి నుంచి ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.60కి చేరింది.
ఈ ధరను చూసి కళ్యాణదుర్గం డివిజన్ రైతులు మళ్లీ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ధర ఇప్పుడున్న దాంట్లో సగం ఉన్నా గిట్టుబాటు అవుతుందన్న నమ్మకంతో పంట వేస్తున్నారు. నాలుగు వేల ఎకరాలకు పైగా సేద్యం చేసి.. మదనపల్లి నుంచి నారు తెప్పిస్తున్నారు. ఇదే తరుణంలో నర్సరీలలో టమాట మొక్కల ధర కూడా పెరిగింది. జిల్లాలో ఉన్న 100 వరకు నర్సరీలలో టమాట మొక్కలు అందుబాటులో లేవు.
7 వేల ఎకరాలకు తగ్గిన సాగు విస్తీర్ణం
జిల్లాలో ఈ ఏడాది టమాట సాగు విస్తీర్ణం ఊహించని విధంగా తగ్గింది. వ్యవసాయ బోర్లలో నీటి మట్టం పడిపోవడం, గాలీవానకు పంటలు దెబ్బ తినడం, జూలై మొదటి వారం వరకు ఎండవేడిమి ఎక్కువగా ఉండటంతో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణ పరిస్థితుల్లోనైతే జిల్లాలో పది వేల ఎకరాలకు పైగా టమాట వేసేవారు. ఈసారి మాత్రం ఏడు వేల ఎకరాలకే పరిమితమైంది. ఇందులోనూ ఒక్క కళ్యాణదుర్గం డివిజన్‌లోనే ఐదు వేల ఎకరాలలో సాగు చేశారు. ప్రస్తుతం మరో నాలుగు వేల ఎకరాలలో మొక్కలు నాటుతున్నారు.
గతమంతా నష్టాలమయం
జిల్లాలోని టమాట రైతులు 2009లో జల్, లైలా తుపానులు, 2010లో తెగుళ్లు, 2011లో అమ్మకాలు లేక పంట కుళ్లిపోవడం, 2012లో నీలం తుపాను, 2013లో వర్షాభావం వల్ల పంట దిగుబడి తగ్గిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. సాధారణంగా జిల్లాలో ఫిబ్రవరి, మార్చి మాసాల్లో టమాట సాగు చేస్తారు. ఈ మాసాల్లో సాగు చేస్తే వేసవికి ముందే అంటే ఏప్రిల్, మే నాటికే పూర్తి స్థాయిలో దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల్లో తీవ్ర వర్షాభావం కారణంగా వ్యవసాయ బోర్లు ఎండిపోయాయి. దీంతో టమాట సాగు చేయలేదు. మే రెండవ వారం తొలకరి వర్షాలు ఊరించడంతో పంట వేశారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏడాది పొడవునా టమాట సాగు చేసే చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు ప్రాంతంలో కూడా సాగు విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ధరకు రెక్కలొస్తున్నాయి.
వినియోగం, దిగుబడికి మధ్య వ్యత్యాసం
రాష్ట్రంలోనే అతిపెద్ద టమాట మార్కెట్ మదనపల్లెలో ఉంది. ఈ మార్కెట్‌కు చిత్తూరు జిల్లా నుంచే కాకుండా, కర్ణాటక రాష్ట్రంతో పాటు అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు, కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, ప్యాపిలి ప్రాంతాల నుంచి టమాట తీసుకెళుతుంటారు. రోజూ మదనపల్లె మార్కెట్‌కు 550 నుంచి 600 టన్నుల వరకు టమాట వస్తుంటుంది.
అక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుతో పాటు తమిళ నాడు, పాండిచ్చేరి, గోవా, ఢిల్లీ, ముంబాయి, నాగపూర్, చత్తీస్‌ఘడ్‌కు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం రాయలసీమ వ్యాప్తంగా టమాట దిగుబడి తగ్గిపోయి మదనపల్లె మార్కెట్‌కు 200-220 టన్నుల మధ్యలో వస్తోంది. దీంతో మదనపల్లె మార్కెట్‌లో వేలం పాటల్లో పోటీ పెరిగిపోయి ధరలు భగ్గుమంటున్నాయి.
దీన్ని పసిగట్టిన జిల్లాకు చెందిన రైతులు ఒక్క టన్ను కూడా ఇక్కడ విక్రయించకుండా పూర్తిగా దిగుబడిని మదనపల్లెకు తరలిస్తున్నారు. తిరిగి అక్కడి నుంచే జిల్లాకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. శనివారం మదనపల్లె మార్కెట్‌లో కిలో టమాట మొదటి రకం రూ.50, రెండో రకం రూ.45 పలికాయి. మొదటి రకం టమాట విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. రెండో రకం స్థానిక వ్యాపారులు కొనుగోలు చేస్తారు. హోల్‌సేల్‌గానే కిలో రూ.45 పలకడంతో రవాణా ఖర్చులు, ఇతర వాటిని కలుపుకుని జిల్లాలో రూ.60కి పైగానే విక్రయిస్తున్నారు.