మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు
సాక్షి, కృష్ణా : టీడీపీ పాలనలో ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ప్రశ్నించారు. తమ పాలనలో ఏం చేశారో చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పాలనను చంద్రబాబు అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ట్రిపుల్ ఐటీలోని విద్యార్థుల కోసం కేటాయించిన రూ.185 కోట్ల సొమ్మును.. చంద్రబాబు తన స్వార్థం కోసం పసుపు-కుంకుమ పథకానికి వాడుకున్నారని ఆరోపించారు. అటువంటి సీఎం భారతదేశంలో ఎక్కడా లేడని దుయ్యబట్టారు.
అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెల్లించకుండా చంద్రబాబు సాగించిన పాలనను ఆయన గుర్తుచేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు ఎంతమాత్రం లేదన్నారు. సీఎం వైఎస్ జగన్ మూడు నెలల పాలనపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఇతర దేశాల్లోని నగరాలకు ధీటుగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment