రైతులపై పవర్ ప్రతాపం | Victims of power grid lands are in concern | Sakshi
Sakshi News home page

రైతులపై పవర్ ప్రతాపం

Published Fri, Nov 21 2014 1:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

Victims of power grid lands are in concern

గంగాధర నెల్లూరు మండలంలో పవర్ గ్రిడ్ భూ బాధితులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను అధికారులు అణచివేశారు. రైతుల డిమాండ్లను తుంగలో తొక్కేశారు. పోలీసు బందోబస్తుతో గురువారం పవర్‌గ్రిడ్ పనులు చేపట్టారు. అడ్డొచ్చిన 10 మంది రైతులను అరెస్టు చేశారు. రైతుల శాపనార్థాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.     

గంగాధరనెల్లూరు / సాక్షి, చిత్తూరు: వేల్కూరు, పెద్దకాల్వ, కొట్రకోన పంచాయతీల్లో హై టెన్షన్ విద్యుత్ లేన్ల ఏర్పాటు కారణంగా భూములు కోల్పోయిన రైతులు  నష్ట పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ మూడు నెలలుగా పలు ఆందోళన కార్యక్రమాలు  నిర్వహిస్తున్నారు. నామమాత్రంగా నష్టపరిహారం చెల్లించి  పవర్‌గ్రిడ్ అధికారులు చేతులు దులుపుకున్నారని ఆరోపిం చారు. వారం రోజుల క్రితం సైతం చిత్తూరు ఆర్డీవో పెంచలకిషోర్, చిత్తూరు డీఎస్పీ లక్ష్మినాయుడు ఆధ్వర్యంలో రైతులతో  చర్చలు జరిపారు. జిల్లా అధికారులు సైతం దీనికి కమిటీ వేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు.

ఈ నేపథ్యంలో బాధిత రైతుల గోడును పక్కన పెట్టి గురువారం పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరింపచేసి పవర్‌గ్రిడ్ పనులు చేపట్టారు. అడ్డొచ్చిన 10 మంది రైతులను అరెస్టుచేసి పోలీసు కేసులు పెట్టారు. అరెస్టరుున వారిలో జయదేవనాయుడు, అశోక్‌నాయుడు, బాలకృష్ణమూర్తి, విజయకుమార్, సుబ్రమణ్యంనాయుడు, సుధాకర్‌నాయుడు, నాగరాజులునాయుడు, భూలక్ష్మి, సుమిత్ర, రాణి ఉన్నారు. చిత్తూరు డీఎస్పీ లక్ష్మినాయుడు సహా పలువురు సీఐలు, ఎస్‌ఐలు, వంద మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ సుశీలమ్మ, ఆర్‌ఐలు  దొరబాబు, రవి, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి  హాజరయ్యారు.   

ఇదెక్కడి న్యాయం?
ఇదెక్కడి న్యాయం అంటూ పెద్దకాల్వకు చెంది న భూలక్ష్మి రోదించడం పలువురిని కలచి వే సింది. పెద్దకాల్వ పంచాయతీలో ఆమెకు సం బంధించిన భూముల్లో హై టెన్షన్ విద్యుత్ లేన్ వెళుతోంది. గురువారం భూలక్ష్మికి చెందిన పొ లాల్లో అడ్డుగా ఉన్న  నెల్లికాయచెట్లను, కొబ్బరి చెట్లను నరికి వేశారు.  చెట్ల వద్దకు వెళ్లి భూలక్ష్మి రోదించింది. దీంతో ఎక్కడ ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమెను శాంతింపజేశారు.

చిత్తూరు తాలూకా పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా
పరిహారం ఇవ్వాలని అడిగినందుకు పవర్‌గ్రిడ్ వారు పోలీసు బలగాలతో దౌర్జన్యానికి దిగి రైతులను అరెస్టులు చేసి చిత్తూరు తాలూకా పోలీసు స్టేషన్లో ఉంచారనే విషయం తెలుసుకుని  వేల్కూర్,పెద్దకాల్వ, కొట్రకోన ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పోలీసుస్టేషన్‌లో ఉన్న రైతులకు మద్దతుగా స్టేషన్ బయట ధర్నా చేపట్టారు. హై టెన్షన్ లేన్ నిర్మాణం వల్ల బోర్లు, పొలాలు, మామిడి చెట్లతో పాటు పలు పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయినట్లు పెద్దకాల్వకు చెందిన మహిళా రైతులు సీ.మల్లిక, పీపీ ఆగ్రహారానికి చెందిన వళ్లియమ్మ వాపోయారు. బోర్లు,మామిడి తోటలు తెగనరికారని  తెలిపారు.

పెద్ద ఎత్తున నష్టపోయినా అధికారులు టవర్ నిర్మాణం పరిధిలో దెబ్బతిన్న  పంటలకు మాత్రమే పరిహారం ఇస్తామని చెబుతున్నారని పలువురు రైతులు పేర్కొన్నారు. నెల్లూరులో మంచి పరిహారం ఇచ్చి ఇక్కడ మాత్రం  ససేమిరా అంటున్నారని వారు చెప్పారు. సరైన పరిహారం ఇచ్చేవరకూ ఆందోళన ఆపేది లేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ రైతులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు కిషాన్‌సంగ్ మద్దతు పలికింది. ధర్నా విరమించాలని పోలీసులు కోరినా రైతులు కొనసాగించారు.  అరెస్టయిన  రైతులను సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పోలీసులు  గ్రామపెద్దల పూచీకత్తుపై విడుదల చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement