కర్నూలు: అభం శుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని వారు తట్టుకోలేక పోయారు. దాడికి పాల్పడిన మానవ మృగాన్ని తామే చంపేస్తామంటూ పాతబస్తి వాసులు ఒక్కటై కదలివచ్చారు. కర్నూలు పెద్దాసుపత్రి ఆవరణలోని పోలీసు సదన్‌లో చికిత్స పొందుతున్న నిందితుడిని అంతు చూస్తామంటూ సోమవారం రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఆసుపత్రి ఎదురుగా గంట పాటు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సార్... మాకు ఐదు నిమిషాలు అవకాశమివ్వండి... ఆ మానవ మృగాన్ని చంపేస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ఈ దశలో ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. పాతబస్తీ వాసులకు బీజేపీ నాయకులు హరీష్ బాబు, రంగస్వామి, హేమలత, కాంగ్రెస్ నాయకులు పద్మావతి తదితరులు మద్దతు తెలిపారు. రాస్తారోకో అనంతరం ఒక్క ఉదుటున వందల సంఖ్యలో యువకులు నిందితుడు చికిత్స పొందుతున్న పోలీస్ సదన్ వద్దకు పరుగులు తీశారు. దీంతో ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు రంగనాయకులు, ప్రవీణ్‌కుమార్, బాబుప్రసాద్, రామకృష్ణ తమ సిబ్బందితో ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో మళ్లీ ఆందోళనకారులు ఆసుపత్రి ఎదుట రహదారిపై ఆందోళన చేశారు. నిందితుడిని ఉరి తీసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం అక్కడి నుంచి రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వీరికి వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ నాయకుడు హఫీజ్‌ఖాన్ మద్దతు తెలిపారు.