ఎలుగుదాడి చేస్తున్న దృశ్యం
సోంపేట : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఆదివారం(జూన్ 10) ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భార్యాభర్తలపై దాడి చేసిన ఎలుగు వారిని చంపేసింది. మరో ఎనిమిది మందిని గాయపరిచింది. దీని దాడిలో రెండు ఎడ్లు కూడా తీవ్రంగా గాయపడ్డాయి. చివరకు ప్రజల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. సోంపేట మండలం సిరిమామిడి పంచాయతీ ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైపల్లి ఊర్మిళ(44) ఇల్లు ఊడ్చిన చెత్తను బయట వేయడానికి గ్రామ పొలిమేరల్లో ఉన్న తుఫాను రక్షిత భవనం వద్దకు వెళ్లింది. ఇంతలో ఆమెపై ఎలుగు దాడికి దిగింది.
ఆమె కేకలు వేయడంతో భర్త తిరుపతి(48) ఊర్మిళను రక్షించడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిపైనా ఎలుగు దాడిచేసింది. వీరిద్దరిని రక్షించడానికి గ్రామానికి చెందిన బైపల్లి దుర్యోధన, బైపల్లి పాపారావు, బైపల్లి రవి, బైపల్లి అప్పలస్వామి, రట్టి అప్పన్న ప్రయత్నించగా వారిని కూడా ఎలుగు గాయపరిచింది. దీంతో స్థానికులు క్షతగాత్రులను పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఊర్మిళ మరణించింది. బైపల్లి తిరుపతి, అప్పలస్వామి, దుర్యోధనల పరిస్థితి విషమించడంతో వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తిరుపతి కూడా కన్ను మూశాడు. వీరిపై దాడి చేసిన ఎలుగు సిరిమామిడి గ్రామానికి చెందిన కె. చిట్టయ్యతో పాటు మందస మండలానికి చెందిన బి.గోపాల్, జె.నారాయణ, ఎం.పాపారావులపైనా దాడి చేసింది.
ఎర్రముక్కాం గ్రామానికి చెందిన బైపల్లి హేమరాజు కాడెడ్లపై దాడి చేయడంతో ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చుట్టు పక్కల గ్రామాల వారు హడలిపోయారు. తలుపులు వేసి ఇళ్లలోనే ఉండిపోయారు. ఆఖరకు మందస మండలం పితాళి గ్రామంలో ఎలుగును స్థానికులు హతమార్చారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎలుగును తరిమేందుకు యత్నించిన ఓ యువకుడిపై అది తిరగబడింది.
Comments
Please login to add a commentAdd a comment