విజిలెన్స్ దాడులు | Vigilance raids in Gollaprolu | Sakshi
Sakshi News home page

విజిలెన్స్ దాడులు

Published Wed, Nov 6 2013 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

Vigilance raids in Gollaprolu

 గొల్లప్రోలు, న్యూస్‌లైన్ :హోల్‌సేల్ ఉల్లి వ్యాపారులపై విజిలెన్స్, ఎన్‌ఫోర్‌‌సమెంట్ అధికారులు మంగళవారం కొరడా ఝళిపించారు. గొల్లప్రోలులోని ఆరుగురు ఉల్లి ట్రేడర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ బి.నరసింహులు ఆధ్వర్యంలో రెండు బృందాలు దాడులు చేశాయి. గొల్లప్రోలులోని తాటిపర్తి రోడ్డు, మెయిన్ రోడ్డు, రాయవరం రోడ్డు వద్ద ఉన్న గోడౌన్లలో ఉల్లి నిల్వలను తనిఖీలు చేశారు. స్టాకు రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. క్రయ, విక్రయాలు, పన్ను చెల్లింపు పత్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 42 టన్నులు ఉల్లి నిల్వలను గుర్తించినట్టు ఎస్పీ నరసింహులు తెలిపారు.
 
 రికార్డులు సక్రమంగా లేకపోవడం, లెసైన్స్ లేకుండా వ్యాపారం చేస్తుండడం, మార్కెట్ సెస్ సక్రమంగా చెల్లించకపోవడంతో రూ.8.37 లక్షల విలువైన ఉల్లి అమ్మకాలు తక్షణం నిలిపివేయాలని ఆదేశించామన్నారు. మార్కెట్లో ఉల్లి ధరలను అరికట్టడమే లక్ష్యంగా తొలిసారిగా ఈ దాడులు చేశామన్నారు. ధరలు పెరగడాన్ని అవకాశంగా తీసుకుని హోల్‌సేల్ వ్యాపారులు బహిరంగ మార్కెట్లో ఉల్లిని అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. అక్రమ నిల్వలను గుర్తించేందుకు, అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఈ దాడులు చేశామన్నారు. వ్యాపారులు ఉల్లి కొనుగోలు, విక్రయ ధరల మధ్య తేడాను తగ్గించేందుకు ఈ తనిఖీలు దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ సెస్ రూ.10 వేలు వసూలు చేశారు. తనిఖీల్లో సీఐ చవాన్, ఏఓ జి.శ్రీనివాస్, ఏఎస్సై రాఘవ, మార్కెట్ కమిటీ సూపర్‌వైజర్లు భాస్కరరావు, జాన్‌బాషా పాల్గొన్నారు.
 
 రాజమండ్రిలో..
 ఆల్కాట్‌తోట(రాజమండ్రి) : రాజమండ్రిలోని 19 హోల్‌సేల్ ఉల్లి దుకాణాలపై విజిలెన్‌‌స అధికారులు దాడి చేశారు. మార్కెటింగ్ శాఖకు ప్రతి నెలా కొనుగోలు రిటర్న్స్ ఇస్తున్నదీ లేనిదీ ఆరా తీశారు. స్టాకు రిజిస్టర్‌కు మించి ఉల్లిపాయలను అదనంగా ఉంచారా అన్న దానిపై సమాచారం సేకరించారు. వ్యాపారులు అదనంగా ఉల్లిపాయలను బ్లాక్ చేయలేదని విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో డీసీటీఓ రత్నకుమార్, అటవీ అధికారి వల్లి, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement