
రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
- నాలుగు షాపుల సీజ్
తడ: సరుకుల పంపిణీ సక్రమంగా జరగడంలేదనే ఆరోపణలు రావడంతో మండలంలోని నాలుగు రేషన్ దుకాణాలను విజిలెన్స్ డీఎస్పీ ఎస్‌ఎం రమేష్ ఆధ్వర్యంలో అధికారులు సోమవారం తనిఖీ చేశారు. రికార్డులకు, సరుకు నిల్వలకు తేడా ఉండటంతో నాలుగు దుకాణాలను సీజ్ చేశారు. విజిలెన్స్ ఏఓ ధనుంజయ్‌రెడ్డి కథనం మేరకు..పలు రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల విజిలెన్స్ ఎస్పీ టి.రాంప్రసాదరావుకు ఫిర్యాదులొచ్చాయి.
ఆయన ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు తడ, తడ కండ్రిగలోని 16, 17 నంబర్ల షాపులను, పూడికుప్పం, భీములవారిపాళేనికి చెందిన 37,26 నంబర్ల షాపులను పరిశీలించారు. ఒకే డీలర్ ఆధ్వర్యంలో నడుస్తున్న 16, 17 నంబర్ల దుకాణాల్లో 500 కిలోల బియ్యం ఎక్కువగా, 27 కిలోల చక్కెర తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పూడికుప్పంలో 180 కి లోల బియ్యం ఎక్కువగా, 3 కిలోల చక్కెర తక్కువగా, భీములవారిపాళెం దుకాణంలో 130 కిలోల బియ్యం ఎక్కువగా, 20 కిలోల చక్కెర తక్కువగా ఉన్నట్లు తేలింది.
దుకాణాలు సీజ్ చేయడంతో పాటు సంబంధిత డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని, లబ్ధిదారులను మోసం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో సీఐ జి.సంఘమేశ్వరరావు, సీఎస్ డీటీ పెంచల కుమార్, తడ ఆర్‌ఐ తులసీమాల, వీఆర్‌ఓలు రామకృష్ణ, వెంకటయ్య, బాబు పాల్గొన్నారు.