
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్పీజీ భద్రత స్టేటస్ సింబల్ కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఎస్పీజీ సవరణ బిల్లుపై ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. వ్యక్తులకు ఉన్న ముప్పును ఆధారంగా చేసుకుని ఎస్పీజీ భద్రత కల్పించాలని కోరారు. కేవలం ఒక కుటుంబంలో జన్మించిన కారణంగా ఎస్పీజీ భద్రత ఇవ్వాలనేది సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వలసవాద మనస్తత్వాన్ని విడనాడలని తెలిపారు. సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన ఎస్పీజీ సవరణ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నట్టు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఎర్ర బల్బు సంస్కృతిని పారద్రోలారని.. అదే పద్ధతిలో ఎస్పీజీ సవరణను తీసుకురావడం స్వాగతించదగ్గ విషయమని పేర్కొన్నారు.
ఐటీపై టాస్క్ ఫోర్స్ నివేదిక అందింది : కేంద్రం
ఆదాయపు పన్ను చట్టాన్ని సమీక్షించేందుకు నియమించిన టాస్క్ ఫోర్స్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. టాస్క్ ఫోర్స్ సిఫార్సులను పరిగణలోకి తీసుకునే విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆదాయ పన్ను చట్టాన్ని సమీక్షించి దేశంలో నెలకొన్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కొత్తగా ప్రత్యక్ష పన్నుల చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం 2017లోనే టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం వాస్తమేనని మంత్రి వెల్లడించారు.
ఆ తర్వాత 2018, 2019 లలో ఈ టాస్క్ ఫోర్స్‌ను పున:వ్యవస్థీకరించడం జరిగిందని మంత్రి తెలిపారు. అలా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ గత ఆగస్టు 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు చెప్పారు. టాస్క్ ఫోర్స్ తన నివేదికలో చేసిన సిఫార్సులను బహిర్గతం చేయలేదని, అలాగే ఆ సిఫార్సులను పరిగణలోకి తీసుకునే అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
విశాఖలో ఆయుర్వేద, హోమియో డిస్పెన్సర్సీలకు ఆమోదం
విశాఖపట్నంలో కేంద్ర ప్రభత్వ హెల్త్ స్కీమ్(సీజీహెచ్‌ఎస్) కింద ఆయుర్వేద, హోమియో డిస్పెన్సరీలు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ఆరోగ్య శాఖ సహాయం మంత్రి అశ్వినీకుమార్ చెప్పారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు జవాబు ఇచ్చారు.