టీఆర్‌ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతి అధికార కాంగ్రెస్‌లో చేరే విషయం కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్ పెద్దల నుంచి ఆశించిన మేర హామీలు రాకపోవడం వల్ల చేరికపై జాప్యం జరుగుతున్నట్టు సమాచారం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
టీఆర్‌ఎస్ బహిష్కృత ఎంపీ విజయశాంతి అధికార కాంగ్రెస్‌లో చేరే విషయం కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్ పెద్దల నుంచి ఆశించిన మేర హామీలు రాకపోవడం వల్ల చేరికపై జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లో చేరాలా? వద్దా?, చేరితే ఎప్పుడు? అనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత లేకపోవడంతో విజయశాంతి దారెటు అనే విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మెదక్ ఎంపీ విజయశాంతి గత ఆగస్టు ఎనిమిదిన భేటీ అయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీని కూడా కలిశారు. దీంతో కాంగ్రెస్‌లో విజయశాంతి చేరిక లాంఛనమేనంటూ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే సోనియాతో భేటీ జరిగి నెల రోజులు దాటినా ఆ పార్టీలో చేరికపై ఇంకా స్పష్టత రావడం లేదు. మరోవైపు కాంగ్రెస్ జిల్లా నేతలు విజయశాంతిని తీసుకోకూడదంటూ తన వాణిని బలంగా వినిపిస్తున్నారు.
2009 ఎన్నికల్లో టీఆర్ ఎస్ పక్షాన ఎంపీగా ఎన్నికైన విజయశాంతి రెండు నెలల క్రితమే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ టికెట్ ఇవ్వాలనే షరతు మీద కాంగ్రెస్‌లో చేరేందుకు విజయశాంతి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అయితే వచ్చే ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ కేటాయింపుపై ఇప్పటివరకు స్పష్టమైన హామీ దక్కలేదని ప్రచారం జరుగుతోంది. రాజ్యసభకు పంపే అంశంపైనా పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వడం లేదని.. దీంతో ఓ వైపు పార్టీతో సన్నిహితంగా ఉంటూనే, మరోవైపు కాంగ్రెస్‌లో చేరడంపై విజయశాంతి మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.
జిల్లా నేతల విముఖత
ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరికపై ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలు విముఖత చూపుతున్నారు. ఇప్పటివరకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలెవరితోనూ విజయశాంతి తన చేరికపై మనోగతాన్ని వెల్లడించలేదు. మరోవైపు అధికారంగా పార్టీలో చేరకుండానే మూడు రోజుల క్రితం ములుగు మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాను విజయశాంతి ఆవిష్కరించడంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయానికి లోనయ్యారు. పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న వారిని వదిలి అధిష్టానం ఇతరులకు టికెట్ కేటాయిస్తుందని అనుకోవడం లేదని మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఓ కీలక నేత వ్యాఖ్యానించారు.
గతంలో విజయశాంతిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన చాగన్ల నరేంద్రనాథ్ బీసీ కోటాలో మరోమారు తనకు పోటీ చేసే అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో విజయశాంతి చేరికపై ఆమె సన్నిహిత వర్గాలు ఆచీతూచి స్పందిస్తున్నాయి. ‘కాంగ్రెస్‌లో చేరే విషయంలో ఎంపీ తొందర పడడం లేదని, పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తర్వాతే అధికారికంగా చేరుతారు’ అని ఎంపీ సన్నిహిత అనుచరుడు ‘సాక్షి’కి వెల్లడించారు.