చిన్నమ్మ పర్యటనకు ఏర్పాట్లు చేసిందెవరు..?
పురందేశ్వరి వ్యవహారంపై వీడని వివాదం
ఎంపీ వర్గం నేతలపై ఎమ్మెల్యే ఆగ్రహం
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనకు అనుకూలంగా, సీమాంధ్ర హక్కుల పరిరక్షణ కోసం అంటూ విజయవాడలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు నిర్వహించిన సమావేశం వివాదం ఇంకా వీడటం లేదు. ఒకపక్క కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తామంతా ఖండిస్తుంటే, ఎంపీ లగడపాటి రాజగోపాల్ వాటిని సమర్ధించడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇరుకున పడేసింది. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమెపై అభాండాలు వేయటం మంచిది కాదని, తాను విశాఖపట్నం వెళ్లిన సందర్భంలో అక్కడ ప్రజలు కూడా ఇదే విధంగా వారి భయాలను వివరించారంటూ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేంద్రమంత్రి పురందేశ్వరిని సమర్ధించిన సంగతి తెలిసిందే.
అసలు పురందేశ్వరి పర్యటనకు ఏర్పాట్లు చేసిందెవరన్న అంశంపై కాంగ్రెస్‌పార్టీలో చర్చ నడుస్తోంది. ఎంపీ రాజగోపాల్‌కి అత్యంత సన్నిహితంగా ఉన్న వారే ముందుండి అన్ని ఏర్పాట్లు చేశారని సమాచారం. మరికొందరు నాయకులు కేంద్ర మంత్రితో టచ్‌లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం నాడు నగర ప్రధమ మేయర్ టి.వెంకటేశ్వరరావు సంతాపసభ సందర్భంగా ఒక నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. ‘మేం కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడాలి, మీరేమో ఏర్పాట్లు చేస్తారా?’ అంటూ ఎంపీ వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్‌పై సదరు ఎమ్మెల్యే బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే కేంద్రమంత్రి పురందేశ్వరి పర్యటన ఎంపీ రాజగోపాల్‌కు తెలిసే జరిగినట్లుగా ఉందని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు నెలరోజుల తర్వాత నగరానికి వచ్చిన ఎంపీ రాజగోపాల్.. తనను కాంగ్రెస్ పార్టీ, నాయకులు నమ్మకపోయినా, ప్రజలంతా పూర్తిగా నమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు చూస్తుంటే ఎంపీ రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారని, అదే సమయంలో విజయవాడ నుంచే పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కనపడుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంపీకి తాము ఎలా అండగా నిలబడాలని ఆ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ నిలబడితే తర్వాత తమ పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు.