జూన్ నుంచి ‘మెట్రో’ పనులు | Vijayawada metro train work progress to be started from June | Sakshi
Sakshi News home page

జూన్ నుంచి ‘మెట్రో’ పనులు

Published Mon, Apr 27 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

జూన్ నుంచి ‘మెట్రో’ పనులు

జూన్ నుంచి ‘మెట్రో’ పనులు

* విజయవాడ మెట్రో రైలు వ్యయం రూ.6,823 కోట్లు
* సీఎం చంద్రబాబుకు డీపీఆర్‌ను అందజేసిన శ్రీధరన్
* కిలోమీటరుకు రూ.209 కోట్లు
* రెండు కారిడార్లు.. 26.03 కిలోమీటర్ల పొడవు
* చార్జీలు 5 కి.మీ.కు రూ.10.. పది కి.మీ.కు రూ.20..ఆ పైన రూ.30
* విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి రూటులో
* మెట్రో రైలు లాభసాటి కాదని స్పష్టీకరణ

 
విజయవాడ మెట్రో రైలు నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.6,823 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) ముఖ్య సలహాదారు శ్రీధరన్ ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడును కలసి విజయవాడ మెట్రో రైలు మొదటి దశకు సంబంధించి డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను అందజేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. శ్రీధరన్ సమర్పించిన డీపీఆర్ ప్రకారం.. కిలోమీటరు మెట్రో రైలు నిర్మాణానికి రూ.209 కోట్లు ఖర్చు కానుంది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి రెండు కారిడార్లుగా మెట్రో రైలు నిర్మాణాన్ని రూపొందించారు. కారిడార్-1గా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి పెనమలూరు(12.76 కి.మీ.), కారిడార్-2గా పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి నిడమానూరు వరకు (13.27 కి.మీ.) మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నట్లు శ్రీధరన్ వివరించారు. రెండు కారిడార్లు కలిపి మొత్తం 26.03 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపారు. కారిడార్-1, 2లలో రాజధాని ప్రాంతం అమరావతి, గన్నవరం ఎయిర్‌పోర్టు, ఇంద్రకీలాద్రి(గొల్లపూడి)కి మెట్రో రైలు కనెక్టివిటీ ప్రతిపాదనలు రూపొందించారు.
 - సాక్షి, హైదరాబాద్
 
 జూన్ నుంచి మొదటి దశ పనులు..
 జూన్ నుంచి మెట్రో ప్రాజెక్టు మొదటిదశ పనుల్ని ప్రారంభిస్తామని శ్రీధరన్ తెలిపారు. 2019 జనవరి 1 కల్లా ఓ దశను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కాగా 2019-20 నాటికి ట్రాఫిక్ డిమాండ్ 2.91 లక్షల ట్రిప్‌లు అయితే, 2051-52 నాటికి 9.99 లక్షల ట్రిప్‌లకు చేరుతుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సభ్యులు స్పష్టం చేశారు. రాజధాని అవసరాలదృష్ట్యా మెట్రో రైల్ ట్రాఫిక్ భారీగా పెరుగుతుందన్న ఆశాభావాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. విశాఖ మెట్రో రైలు డీపీఆర్ జూన్ 15కల్లా సిద్ధమవుతుందని శ్రీధరన్ తెలిపారు. ఇదిలా ఉండగా విశాఖ నుంచి అమరావతి మీదుగా తిరుపతి, అలాగే బెంగళూరు నుంచి అమరావతికి హై స్పీడ్ ట్రెయిన్ ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు వివరించారు. వచ్చే కేబినెట్ భేటీలో ఈ ప్రాజెక్టుల గురించి చర్చిస్తామన్నారు.
 
డీపీఆర్‌లోని ప్రధానాంశాలివీ..
* మెట్రో రైలు ప్రాజెక్టును రూ.5,705 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని, నాలుగేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే నిర్మాణం పూర్తయ్యేనాటికి రూ.6,823 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు.
* కారిడార్-1ను కృష్ణానది రైల్వే బ్రిడ్జికి 200 మీటర్ల దిగువకు పొడిగించి అక్కడినుంచి కుడివైపుగా తుళ్లూరు ప్రాంతానికి కలిపేలా ప్రతిపాదించారు.
* మెట్రో రైలులో మూడు బోగీలుంటాయి. గంటకు 40 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికుల్ని చేరవేస్తాయి.
* రాజధానిని అభివృద్ధి చేసేదశలో భూగర్భ మెట్రో రైలు నిర్మాణం చేపడితే కిలోమీటరుకు రూ.500-600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
* మెట్రో రైలు చార్జీలను ఐదు కిలోమీటర్లకు రూ.10, పది కిలోమీటర్లకు రూ.20, ఆ పైన అయితే రూ.30గా ప్రభుత్వం నిర్ణయించింది.
* మెట్రో రైలు ప్రాజెక్టుకు మొత్తం 31.029 హెక్టార్లు ప్రైవేటు, ప్రభుత్వ భూములు అవసరమని డీపీఆర్‌లో పేర్కొన్నారు. అలాగే మెట్రో రైలు డిపోకు 11.34 హెక్టార్ల  భూమి అవసరమన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుకోసం ప్రభుత్వ భూములను రిజర్వ్ చేయనున్నట్లు సర్కారు స్పష్టం చేసింది.
రెండు కారిడార్లలో ప్రభుత్వ భూమిని ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌తో ప్రాజెక్టుకు నిధుల సమీకరణకోసం ఉపయోగిస్తారు. భూసేకరణకు డీఎంఆర్‌సీ రూపకల్పన చేస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో డీఎంఆర్‌సీ 6 శాతం వసూలు చేస్తుంది. ల్యాండ్, ఎస్టాబ్లిష్‌మెంటు చార్జీలు కలపకుండా ఇది రూ.320 కోట్లు కావచ్చని అంచనా.
* ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) తరహాలోనే తాజా ప్రాజెక్టును నిర్మిస్తారు. ఏపీ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వంతోపాటు నిర్మాణంలో పాలుపంచుకునేందుకు మరో కొత్త నిర్మాణ కంపెనీ ఏర్పాటవుతుంది. భూసేకరణకయ్యే రూ.769 కోట్ల ఖర్చును ఏపీ ప్రభుత్వం భరించనుంది. మెట్రో రైలు నిర్మాణ వ్యయాన్ని జైకా లాంటి సంస్థలద్వారా రుణం రూపేణా సేకరిస్తారు. ఏడేళ్లలో పెట్టుబడి తిరిగి వచ్చేలా చార్జీలను నిర్ణయించారు.
* విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి రూటుకు మెట్రో రైలు లాభసాటి కాదని డీఎంఆర్‌సీ పేర్కొంది. ఇందుకు ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టంను ప్రతిపాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement