సాక్షి, అమరావతి బ్యూరో (కృష్ణా): కుర్రాళ్లు బైక్ ఎక్కారంటే చాలు.. రోడ్డుపై నడపాల్సిన బండిని గాల్లో లేపేస్తుంటారు. ఆ బైకును రాకెట్ అనుకుంటారో లేక తమకే రెక్కలొచ్చాయని ఫీలవుతారో కానీ.. 100, 150 æదాటిన స్పీడ్‌లో రయ్యిన దూసుకెళ్తుంటే.. చూసేవారి ఒళ్లు జలదరించాల్సిందే.
నిన్నమొన్నటి వరకు హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఈ రేస్ పిచ్చి.. విజయవాడలోను మొదలైంది. వీకెండ్ వచ్చిందంటే చాలు.. నగరంలోని విశాల రహదారుల్లో ఈ దృశ్యాలు సర్వ సాధారణమైపోయాయి.
ఇన్నాళ్లు హైదరాబాద్‌కే పరిమితమైన బైక్ రేస్ విజయవాడకు పాకింది. వీకెండ్‌లో యువత చేసే స్టంట్స్.. వారి ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలను కూడా రిస్క్‌లో పడేస్తున్నాయి. బీఆర్‌టీఎస్ రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్డు, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, సీఎస్‌ఐ ఆస్పత్రి వెనుక రోడ్లు కుర్రాళ్ల బైక్ రేసులకు వేదికగా మారుతున్నాయి. ఇక్కడ విశాలమైన రోడ్లు ఉండటంతో యువత పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నారు. చీకటి పడితే చాలు.. కుర్రాళ్ల డార్క్ డ్రైవింగ్ స్టార్ట్ అవుతుంది. స్పోర్ట్స్ బైకులపై ఓవర్ స్పీడ్‌తో రోడ్డుపై వెళ్లేవారిని భయపెడుతున్నారు.
సరదాలు.. బెట్టింగ్‌లు..
అర్ధరాత్రి అయిందంటే చాలు.. కుర్రాళ్లు నడిరోడ్డుపైకి దూసుకువస్తున్నారు. హాలివుడ్ సినిమా తరహాలో సీన్లు చూపిస్తున్నారు. ఖరీదైన బైకులపై రోడ్డెక్కి రయ్యిన దూసుకెళ్తూ అటు ప్రజలకు ఇటు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. కొందరు సరదా కోసం చేస్తుంటే.. మరికొందరు బెట్టింగ్‌ల కోసం బరితెగిస్తున్నారు.
ఇంజినీరింగ్, డిగ్రీ స్టూడెంట్స్ గ్రూపులుగా ఏర్పడి బైక్ రేసుల్లో పాల్గొంటున్నారు. సింగిల్ టైర్ రైడ్, సైడ్ హ్యాంగింగ్ రైడ్, జిగ్ జాగ్, స్నేక్ రైడ్ ఇలా రకరకాల డేంజర్ స్టంట్‌లతో రేసుల్లో పాల్గొంటున్నారు. 360 డిగ్రీస్, 120 యాంగిల్, ఫ్రంట్ లీ, బ్యాక్ లీ.. పేర్లతో పిలిచే ఈ స్టంట్స్‌పై యువత క్రేజ్ పెంచుకుంటోంది.
పోలీసుకు దొరక్కుండా..!
విజయవాడలో బైక్ రేసింగ్ కొత్తేమీ కాదు. కొన్నేళ్లుగా జరుగుతున్నదే. పోలీసులు రైడ్స్ చేసి రేసర్లను పట్టుకున్న సందర్భాలున్నాయి. పోలీసులు నిఘా పెంచినప్పుడు కాస్త తగ్గుతుందేమో కానీ ఆ తర్వాత అంతా మామూలే. అసలు బైక్ రేసింగ్ కల్చర్ హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండేది. శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్ రేసింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటనలు ఉన్నాయి.
ఆ తర్వాత ఈ రేసింగ్ కల్చర్ విజయవాడ నగరానికి పాకింది. వీకెండ్‌లో రేసులు జోరుగా జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడలో బైక్ రేసుల్లో పాల్గొంటున్న కుర్రాళ్లు తమ బైక్ నంబరు ప్లేట్లు కనిపించకుండా వాటి అంచులను వంచేసి మరీ రేసుల్లో పాల్గొంటున్నారు. ఒకవేళ తమ బైక్ రేసులు సీసీ కెమెరాల్లో రికార్డు అయినా తప్పించుకునేలా ఈ దారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment