తుళ్లూరు : గ్రామాభివృద్ధికి అంతా సమష్టిగా కృషి చేయాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పిలుపునిచ్చారు. రాజధాని పరిధిలోని తుళ్లూరులో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించారు. స్థానిక మేరీమాత హైస్కూల్ జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన స్పీకర్ కోడెల మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పారిశుద్ధ్య లేమి కారణంగా అనారోగ్యం బారినపడి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతివ్యక్తి ఏటా రూ.6,500 ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాకముందు స్థానిక సంస్థలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుండేవన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 13వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయన్నారు. ప్రతిపైసాను ప్రణాళికాబద్ధంగా వ్యయం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీలకు సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ.ఐదువేల కోట్లు అభివృద్ధికి వెచ్చించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,831 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంత్రి తెలిపారు.
ప్రభుత్వం నియమించిన సబ్‌కమిటీ రిపోర్డు ఆధారంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేతనాల పెంపు జరుగుతుందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కృష్ణా జిల్లాలో 117, గుంటూరు జిల్లాలో 138 పంచాయతీలకు ప్రోత్సాహక నగదు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇన్‌చార్జి శ్రీధర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.
సమష్టి కృషితో గ్రామాభివృద్ధి
Published Sun, Apr 26 2015 12:29 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement
Advertisement