పెదవడ్లపూడి (తాడేపల్లి రూరల్): శని, ఆదివారాలు వస్తే పాఠశాలను బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చేసి మందుబాబులు తమ ఆగడాలను సాగిస్తూ చుట్టు పక్కల ప్రాంతాల వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ పెదవడ్లపూడి గ్రామ మహిళలు మంత్రి గంటా శ్రీనివాసరావు, డీజీపీ నండూరి సాంబశివరావుకు ఫిర్యాదు చేశారు. సదరు మహిళలు స్థానికంగా ఉన్న యువకులు చేస్తున్న ఆగడాలను చెప్పడంతో స్థానిక నేతలు ఆ మహిళలను గదిలోకి తీసుకువెళ్లి మాట్లాడించారు. అయితే ఆ మహిళలు స్థానికంగా ఉన్న 23 మంది యువకులు స్కూల్‌లో మద్యం సేవిస్తున్నారంటూ తెలియజేసినట్లు సమాచారం. అయితే మంగళగిరి రూరల్ పోలీసులు నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా డీజీపీ నండూరి సాంబశివరావు మాట్లాడుతూ పెదవడ్లపూడి పాఠశాలల్లో మందుబాబుల ఆగడాలు ఎక్కువయ్యాయని, అక్కడి మహిళలు ఫిర్యాదు చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి అరాచకాలు ఎవరు చేసినా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతి పోలీస్‌స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు పత్రికా ముఖంగా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే పోలీస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలను దత్తతకు తీసుకొని, ఆ పాఠశాలలను క్లీన్ అండ్ గ్రీన్ చేయడంతోపాటు రంగులు వేయడం, పిల్లలతో మమేకమై వారి వద్ద నుంచి సమాచారం సేకరించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.