![VirbhadraSwami Allegations Against AshokGajapathi Raju - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/10/kolagatla.jpg.webp?itok=hs_pg6KV)
ప్రచారంలో కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం మున్సిపాలిటీ: ఐదేళ్ల చంద్రబాబు పాలన పూర్తిగా లంచమయంగా సాగిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి రోజు మంగళవారం 7వ వార్డు ఆయన హుకుంపేట, 13వ వార్డు అశోక్‌నగర్, 9వ వార్డు మేధరవీది, 16వ వార్డు జమ్ము ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కోలగట్లకు అడుగడుగునా ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు నుదుట విజయ తిలకం దిద్ది విజయీభవ అంటూ ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తే... ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి నుంచి గల్లీ వరకు ఒకే ఒక్క పథకం అమలైందని అది దోచుకో.. దాచుకో పథకమని వాఖ్యానించారు. చంద్రబాబు పోలవరం, అమరావతి ప్రాజెక్టులలో లంచాలు తీసుకుంటే... కింద స్థాయి నాయకులు ఇళ్లిస్తే లంచం, పింఛను ఇస్తే లంచం అంటూ దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇవన్నీ కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుకు తెలియదా.. అని ప్రశ్నించారు. కర్ఫ్యూలో అశోక్ ఎక్కడ ఉన్నారో తాను అక్కడే ఉన్నానని పేర్కొన్నారు.
2014 ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనను ప్రస్తావించి ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకున్న అశోక్‌గజపతిరాజు ఐదేళ్లలో తాను చేసిందేమి లేకనే మళ్లీ కర్ఫ్యూ పేరు చెప్పుకుని పబ్బం గడుపుకోవటం సిగ్గు చేటన్నారు. ఐదేళ్ల కాలంలో మీరేం చేశారో చెప్పాలన్నారు. తాను ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 8 వేలు ఇళ్లు కట్టామని, పట్టణంలోని ప్రధాన రహదారులు విస్తరించామన్నారు. మరల అధికారమిస్తే అటువంటి కాలనీలు మరో నాలుగు కట్టించి ఇస్తామన్నారు. తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ప్రచారంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment