జిల్లా రాజకీయాల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. హోరుగాలిలో ఊక ఎగిరిపోయినట్టు.. జోరువానలో ఉప్పు కరిగినట్లు.. వైఎస్ జగన్ సునామీలో రాజకీయ వటవృక్షాలు కొట్టుకుపోయాయి. జిల్లా ప్రజలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంత మెజార్టీ ఇచ్చారో అంతకు మించి వైఎస్సార్‌సీపీని ఆదరించారు. ఈ ఫలితాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుండగా.. టీడీపీ డీలా పడింది. – సాక్షి ప్రతినిధి, అనంతపురం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధిస్తే.. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగించింది. టీడీపీ తరఫున హిందూపురంలో బాలకృష్ణ మాత్రమే గెలుపొందారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. తొలుత పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన 30 నిమిషాలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభించారు. తొలిరౌండ్ నుంచి వైఎస్సార్‌సీసీ ఆధిక్యతను ప్రదర్శించింది. ప్రతిరౌండ్‌లోనూ మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ఉదయం 11 గంటలకే ఫలితాల ట్రెండ్ తేలిపోయింది. హిందూపురం, మినహా తక్కిన 12 నియోజకవర్గాల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అయితే ఉరవకొండలో పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలతో అర్ధరాత్రి దాటినా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది.
ఉద్ధండులకు భంగపాటు
జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాలకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. వీరి కనుసన్నల్లో జిల్లా రాజకీయం నడిచింది. అయితే ఇది గతం. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల నుంచి రాజకీయ వారసులుగా బరిలోకి దిగిన పరిటాల శ్రీరాం, జేసీ పవన్ కుమార్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరిటాల రవీంద్ర వారసుడిగా శ్రీరాం బరిలోకి దిగారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేతిలో 25,575 ఓట్లతో ఘోరపరాభావం చవిచూశారు. పరిటాల కుటుంబం పాతికేళ్ల రాజకీయప్రస్థానంలో తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. ఈ దెబ్బతో పరిటాల కుటుంబానికి ఇక రాజకీయ సమాధి తప్పదనే చర్చ జరుగుతోంది.
సామాన్యులు.. ‘అనంత’ విజేతలు
ఈ ఎన్నికల్లో అందరిచూపు ఇద్దరి సామాన్యులపైనే ఉంది. అనంతపురం జిల్లాలో పలు స్టేషన్లలో ఎస్‌ఐగా, సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్, ఇదే జిల్లాలో గ్రూపు–1 అధికారిగా పనిచేసిన తలారి రంగయ్యలు ఇద్దరు ప్రధాన నేతలపై పోటీగా దిగారు. జేసీ దివాకర్‌రెడ్డి వారసుడిపై రంగయ్య, టీడీపీ అత్యంత బలంగా ఉండే హిందపురం ఎంపీ అభ్యర్థిగా మాధవ్ బరిలోకి దిగారు. అయితే ఈ పోరులో ‘అనంత’ వాసులు సామాన్యుల పక్షాన నిలిచారు. కురబ, బోయ సామాజిక వర్గానికి చెందిన మాధవ్, రంగయ్యలను అఖండ మెజార్టీతో గెలిపించి దీవించారు. మాధవ్, రంVýæయ్య ఇద్దరూ 1.38 లక్షల పైచిలుకు మెజార్టీ సాధించారు. సామాన్యులకు రాజకీయ ఎదుగుదల కల్పించాలనే ఏకైక కారణంతో వీరిద్దరికీ వైఎస్ జగన్ టిక్కెట్ల కేటాయించారు. ఈ ఇద్దరినీ ప్రజలు ఆశీర్వదించారు. వీరితో పాటు రిటైర్డ్ ఐజీ ఇక్బాల్‌ను కూడా హిందపురం బరిలో నిలిపారు. దురదృష్టవశాత్తూ ఈయన బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు.
మంత్రులు, చీఫ్‌విప్‌ల స్థానాల్లో వైఎస్సార్‌సీపీ స్వీప్
మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసుల, శాసనసభ, మండలి చీఫ్‌విప్‌లు పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలైన రాప్తాడు, రాయదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కీలక పదవుల్లో కొనసాగుతున్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి 25,575 ఓట్లతో గెలుపొందగా, రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి 14,463 ఓట్లు, పుట్టపర్తిలో శ్రీధర్‌రెడ్డి 31,276 ఓట్లతో విజయం సాధించారు.
ఫలించిన శింగనమల సెంటిమెంట్
శింగనమలలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. 46,221 ఓట్లతో తిరుగులేని మెజార్టీ సాధించారు. అలాగే వీరితో పాటు గుంతకల్లు వెంకట్రామిరెడ్డి 48,532 ఓట్లతో, కళ్యాణదుర్గం ఉషాశ్రీచరణ్ 19,534 ఓట్లతో విజయం సాధించారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి 7,941 ఓట్లు, మడకశిరలో తిప్పేస్వామి 12,917 ఓట్లు, కదిరిలో సిద్ధారెడ్డి 27,063 ఓట్లతో విజయం దక్కించుకున్నారు.
‘అనంత’లో అఖండ మెజార్టీ
అనంతపురం నియోజకవర్గ చరిత్రలో తిరుగులేని మెజార్టీని వెంకట్రామిరెడ్డి సాధించారు. 27,285 ఓట్లతో అనంత వెంకట్రామిరెడ్డి గెలుపొందారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ఇంత మెజార్టీ రాలేదు. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురునాథరెడ్డి 24,739 ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు ఆ మెజార్టీని వెంకట్రామిరెడ్డి అధిగమించారు.
జిల్లా వ్యాప్తంగా సంబరాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని ఆ పార్టీ శ్రేణులు పండుగలా చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయంలో కేక్‌కట్ చేశారు. గెలుపొందిన నియోజకవర్గాల్లో కేక్ కటింగ్‌లు, ఆలయాల్లో మొక్కుల చెల్లింపులు, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రతీ పల్లెలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఫలితాల రోజు కూలీల మొదలు ఉద్యోగుల వరకు ఎవ్వరూ పనులకు పోకుండా, విధులకు వెళ్లకుండా ఉదయం నుంచి టీవీలకు అతుక్కుని ఫలితాలు వీక్షించారు. ఫలితాలు జగన్‌కు అనుకూలంగా ఉండటంతో అంతా సంబరాల్లో మునిగిపోయారు. రైతులు, మహిళలు, వృద్ధులు కూడా వైఎస్సార్‌సీపీ విజయాన్ని వేడుకగా చేసుకున్నారు.
రాజకీయంగా జేసీ కుటుంబానికి కాలం చెల్లు
జేసీ దివాకర్‌రెడ్డి నాలుగు దశాబ్దాల రాజకీయచరిత్రలో కాంగ్రెస్, టీడీపీ తరఫున పోటీ చేశారు. రాజకీయ అరంగేట్రంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోవడం మినహా ఎప్పుడూ దివాకర్‌రెడ్డి ఓటమి చవిచూడలేదు. అయితే జేసీ బ్రదర్స్ ఇద్దరూ ఈ ఐదేళ్లలో నోటికి ఎంతమాటొస్తే అంతమాట అంటూ జనాల్లో చులకనయ్యారు. తాడిపత్రిలో అవినీతి, అరచకాలతో ‘రౌడీరాజ్యం’ నడిపించారు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డి వారసుడు పవన్‌రెడ్డి లక్షకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే జేసీ ప్రభాకర్‌రెడ్డి వారసుడిగా బరిలోకి దిగిన జేసీ అస్మిత్‌రెడ్డి 8వేల ఓట్లతో ఓటమిపాలయ్యారు. తొలి నుంచి జేసీ కుటుంబం తాడిపత్రికి వరకు మాత్రమే పరిమితమై రాజకీయం నడిపారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచి జిల్లాలో చక్రం తిప్పాలని భావించారు. అయితే ఐదేళ్లకే కోలుకోలేని దెబ్బ తగలింది. తాజా ఓటమితో జేసీ కుటుంబం శకం ముగిసినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం జేసీ వైఖరే అని ఆ పార్టీ శ్రేణులు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో జేసీ బ్రదర్స్ పేరు ఇక ‘అనంత’ రాజకీయాల్లో వినపడకపోవచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment