డిసెంబర్‌లో విశాఖ ఉత్సవ్ | Visakha Utsav in December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో విశాఖ ఉత్సవ్

Published Tue, Aug 12 2014 12:47 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

డిసెంబర్‌లో విశాఖ ఉత్సవ్ - Sakshi

డిసెంబర్‌లో విశాఖ ఉత్సవ్

  •      నిధులివ్వనున్న ప్రభుత్వం
  •      కలెక్టర్ డాక్టర్ యువరాజ్
  • విశాఖ రూరల్: విశాఖ ఉత్సవ్‌ను వచ్చే డిసెంబర్‌లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. ఆయన  సోమవారం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరుకు అంగీకరించిందన్నారు. విశాఖలో పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఉపమాకలోని వేంకటేశ్వర స్వామి ఆలయ మార్గంలో 10 ఎకరాల స్థలాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిపారు. 2019 నాటికి జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటల పోటీల నిర్వహణకు అనువుగా క్రీడా సౌకర్యాలను పెంపొందించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారన్నారు.
     
    గోవాడ చక్కెర పరిశ్రమ విస్తరణ
     
    చోడవరంలోని గోవాడ చక్కెర పరిశ్రమలో ప్రస్తుతం రోజుకు 4 వేల టన్నుల చెరకు క్రషింగ్ జరుగుతుండగా దాన్ని 8 వేల టన్నులకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విస్తరణకు రూ.160 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చెరకు పంటల దిగుబడి తక్కువగా ఉందని, బిందు సేద్యం ద్వారా దిగుబడి పెరుగుతుందని చెప్పారు. నీటి వనరులున్న రైతుల నుంచి మిగిలిన రైతులు కొంత మొత్తాన్ని చెల్లించి నీటిని కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ఇందుకోసం రైతులను ఒక క్లబ్‌గా చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు.
     
    కాఫీ పంటల విస్తరణకు ప్రతిపాదనలు
     
    జిల్లాలో 1.46 లక్షల ఎకరాల్లో కాఫీ పంటలున్నాయని, మరో 50 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తామని కలెక్టర్ తెలిపారు. కాఫీ ఉత్తమ ప్రాసెసింగ్‌తో మంచి ధరలు వస్తాయని, ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా ప్రస్తుతం కాఫీ గింజలు కిలో రూ.50 ఉండగా దాన్ని రూ.600 వరకు విక్రయించవచ్చని చెప్పారు. జిల్లాలో ఏడుగురు హార్టీకల్చర్ ఆఫీసర్లు లేరని, మండల స్థాయిలో ఒకరు కూడా లేరన్నారు. క్షేత్ర స్థాయిలో వీరి నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.
     
    స్థలాలు వెనక్కి..
     
    పరిశ్రమలు, ఐటీ సంస్థల ఏర్పాటుకు స్థలాలు పొంది ఇప్పటి వరకు ప్రారంభించని పక్షంలో ఆయా సంస్థల నుంచి ఆ స్థలాలను వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు చెప్పారు. త్వరలోనే దీనిపై కసరత్తు చేసి కార్యకలాపాలు ప్రారంభించని సంస్థలకు నోటీసులు జారీ చేస్తామన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నెల 31లోగా అన్ని పథకాల లబ్ధిదారులు ఆధార్ వివరాలు అందించాలని సూచించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement