in December
-
లంబసింగిలో యూత్హాస్టల్స్ ట్రెక్కింగ్ క్యాంప్
భీమవరం : భీమవరం యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిసెంబర్లో లంబసింగి, భద్రాచలం, కొల్లేరు తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్టు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ భీమవరం శాఖ అధ్యక్షుడు డాక్టర్ మట్లమూడి చెప్పారు. భీమవరంలో శుక్రవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాంప్ వివరాలను వెల్లడించారు. ఇటీవల పట్టణంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ వీవీజె సోమరాజు, డాక్టర్ సతీష్, డాక్టర్ ఉష, డాక్టర్ రమేష్, మైథిలీ బృందం కాంచనగంగ, పాండిమ్గొలుచా పర్వతాలపై ట్రెక్కింగ్ నిర్వహించారన్నారు. డిసెంబర్లో నిర్వహించే ట్రెక్కింగ్‌లో పాల్గొనే వారు 94926 89575 ఫోన్ నంబర్లో సంప్రదించాలని మట్లపూడి కోరారు. సమావేశలో డాక్టర్ సోమరాజు, సతీష్ పాల్గొన్నారు. -
డిసెంబర్లో విశాఖ ఉత్సవ్
నిధులివ్వనున్న ప్రభుత్వం కలెక్టర్ డాక్టర్ యువరాజ్ విశాఖ రూరల్: విశాఖ ఉత్సవ్‌ను వచ్చే డిసెంబర్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. ఆయన సోమవారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరుకు అంగీకరించిందన్నారు. విశాఖలో పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఉపమాకలోని వేంకటేశ్వర స్వామి ఆలయ మార్గంలో 10 ఎకరాల స్థలాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిపారు. 2019 నాటికి జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటల పోటీల నిర్వహణకు అనువుగా క్రీడా సౌకర్యాలను పెంపొందించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారన్నారు. గోవాడ చక్కెర పరిశ్రమ విస్తరణ చోడవరంలోని గోవాడ చక్కెర పరిశ్రమలో ప్రస్తుతం రోజుకు 4 వేల టన్నుల చెరకు క్రషింగ్ జరుగుతుండగా దాన్ని 8 వేల టన్నులకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విస్తరణకు రూ.160 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చెరకు పంటల దిగుబడి తక్కువగా ఉందని, బిందు సేద్యం ద్వారా దిగుబడి పెరుగుతుందని చెప్పారు. నీటి వనరులున్న రైతుల నుంచి మిగిలిన రైతులు కొంత మొత్తాన్ని చెల్లించి నీటిని కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ఇందుకోసం రైతులను ఒక క్లబ్‌గా చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. కాఫీ పంటల విస్తరణకు ప్రతిపాదనలు జిల్లాలో 1.46 లక్షల ఎకరాల్లో కాఫీ పంటలున్నాయని, మరో 50 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తామని కలెక్టర్ తెలిపారు. కాఫీ ఉత్తమ ప్రాసెసింగ్‌తో మంచి ధరలు వస్తాయని, ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా ప్రస్తుతం కాఫీ గింజలు కిలో రూ.50 ఉండగా దాన్ని రూ.600 వరకు విక్రయించవచ్చని చెప్పారు. జిల్లాలో ఏడుగురు హార్టీకల్చర్ ఆఫీసర్లు లేరని, మండల స్థాయిలో ఒకరు కూడా లేరన్నారు. క్షేత్ర స్థాయిలో వీరి నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. స్థలాలు వెనక్కి.. పరిశ్రమలు, ఐటీ సంస్థల ఏర్పాటుకు స్థలాలు పొంది ఇప్పటి వరకు ప్రారంభించని పక్షంలో ఆయా సంస్థల నుంచి ఆ స్థలాలను వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు చెప్పారు. త్వరలోనే దీనిపై కసరత్తు చేసి కార్యకలాపాలు ప్రారంభించని సంస్థలకు నోటీసులు జారీ చేస్తామన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నెల 31లోగా అన్ని పథకాల లబ్ధిదారులు ఆధార్ వివరాలు అందించాలని సూచించారు.