గుట్కా తయారీ గుట్టు రట్టు | Visakhapatnam Police Raid Gutka Manufacturing Units | Sakshi
Sakshi News home page

గుట్కా తయారీ గుట్టు రట్టు

Published Sun, Aug 25 2019 7:43 AM | Last Updated on Sun, Aug 25 2019 7:44 AM

Visakhapatnam Police Raid Gutka Manufacturing Units - Sakshi

గుట్కా తయారీ యూనిట్‌లో పరిశీలిస్తున్న నగర సీపీ ఆర్‌కే మీనా, ఇతర పోలీసు అధికారులు

సాక్షి, విశాఖపట్నం : శివారులో ఒంటరిగా ఉన్న ఇళ్లను ఎంచుకున్నారు... చిన్న చిన్న పనులు చేసుకుంటున్నామంటూ ఆ ఇళ్లను అద్దెకు తీసుకున్నారు.. ఒక నెల సైలెంట్‌గా ఉంటూ.. ఆ త ర్వాత నుంచి అసలు పనులు ప్రారంభించారు. నివాస స్థలాన్ని గుట్కా ఫ్యాక్టరీలుగా మార్చేశారు.. ఇంటిలోకి వెళ్తే తప్ప.. వాసనను పసిగట్టలేనంతగా పక్కా ఏర్పాట్లు చేశారు... మార్కె ట్లో లభించే ప్రధాన గుట్కా బ్రాండ్ల పేరుతో ప్యాకెట్లను తయారు చేసి.. వివిధ జిల్లాలకు సరఫరా చేశారు. చుట్టు పక్కల కాలేజీ కుర్రాళ్లను మత్తులో ముంచేలా గంజాయినీ సరఫరా చేసే వారు.. మూడేళ్లుగా గుట్టుగా సాగుతున్న భారీ గుట్కా వ్యాపారాన్ని నగర పోలీసులు రట్టు చే శారు. రూ.50లక్షలకు పైగా విలువచేసే గుట్కా, ముడి సరకుని స్వాధీనం చేసుకున్నారు.

నిర్మాణుష్య ప్రాంతాల్లో ఇళ్లని అద్దెకు తీసుకొని గుట్కా తయారు చేస్తున్న ముఠా కార్యకలాపాలపై టాస్క్‌ఫోర్సు, పీఎం పాలెం పోలీసులు శనివారం దాడి చేశారు. పది మంది నిందితులను అరెస్టు చేశారు. రెండు చోట్ల నిర్వహించిన దాడుల్లో భారీగా తయారు చేసిన గుట్కా ప్యాకెట్లు, తయారీకి వినియోగించే ముడి సరుకు, గుట్కా తయారీ యంత్రాలను సీజ్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రుషికొండలోని గుట్కా తయారీ యూనిట్‌ వద్ద నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీనా మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం....

ఇంట్లోనే తయారీ యూనిట్‌.. 
ఒడిశాలోని బరంపురం ప్రాంతానికి చెందిన బాదం సంపత్‌కుమార్, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన పెదబాబు కొన్నేళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వీరిద్దరూ కలిసి 2016లో రుషికొండ మూడో లైన్‌లో ప్లాట్‌ నం.450ని అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమానులు దగ్గర్లో లేకపోవడంతో సమీప బంధువులు వరుసగా రెండు నెలలు అద్దె తీసుకోవడానికి వచ్చి ఇంటిని పరిశీలించారు. ఇంటిని శుభ్రంగా ఉంచుతుండటంతో వారిపై ఎలాంటి అనుమానం రాలేదు. ఇక అప్పటి నుంచి ఇంటిలోనే గుట్కా తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేసేశారు. నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి గుట్కా తయారీకి అవసరమైన ముడి సరుకు, విశాఖ ఏజెన్సీ పాడేరు, అరకు నుంచి గంజాయిని కొనుగోలు చేసి రహస్యంగా దాచి పెట్టారు. ఒడిశా, బిహార్, తెలంగాణతోపాటు రాష్ట్రానికి చెందిన కొంతమంది గుట్కా తయారీ నిపుణులను పనిలో పెట్టుకున్నారు. రాత్రి పూట గుట్కాను గుట్టుగా తయారు చేసేవారు. ఉదయం పూట మార్కెటింగ్‌ కోసం వివిధ వ్యాపారులతో సంప్రదింపులు జరిపి వారికి కావాల్సిన బ్రాండ్‌లను అడిగి.. ఆ బ్రాండ్‌లకు సంబంధించిన కవర్లలో ప్యాకింగ్‌ చేసేవారు. వాటిని జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు గుట్టు చప్పుడు కాకుండా ఎగుమతి చేసేవారు.

విభేదాల కారణంగా మరో యూనిట్‌..
తయారీదారులైన సంపత్, పెదబాబు మధ్య కొద్ది నెలల క్రితం వ్యాపార లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తాయి. వ్యాపారం నుంచి విడిపోయిన సంపత్‌.. అక్కడికి కొద్ది దూరంలోనే రుషికొండలోని సిల్వర్‌ ఓక్స్‌ పాఠశాల సమీపంలో డోర్‌ నం.7–14 వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సొంతంగా రెండు నెలల క్రితం మరో యూనిట్‌ ప్రారంభించాడు. ఈ వ్యాపారాలకు సంబంధించిన విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ బృందం పీఎం పాలెం పోలీసుల సహకారంతో రెండు యూని ట్లపైనా శనివారం దాడులు చేశారు. రెండు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్లాంట్‌ నిర్వాహకులైన సంపత్, పెదబాబు ఇద్దరూ తప్పించుకున్నారు. అక్కడ పనిచేస్తున్న నిజామాబాద్‌ జిల్లా ఖమ్మపల్లెకు చెందిన బొడ్డు రమేష్, రాజమండ్రి చర్చిపేటకు చెందిన నీలమ్‌చంద్‌ సాహు, బీహార్‌ రాష్ట్రం మార గ్రామానికి చెందిన మనోజ్‌ మర్మాడీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం చంద్రనగర్‌కు చెందిన దీపక్‌కుమార్‌ సవిత, బిహార్‌ రాష్ట్రం అకకులార్‌కు చెం దిన జతిన్‌దాస్, విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం కొత్తూరుకి చెందిన గోతురెడ్డి శ్రీనివాస్, బిహార్‌కు చెందిన సునీల్‌ దాస్, బినోద్‌ దాస్, చోటాలాల్‌మున్‌మూన్, ఒడిశాకు చెందిన అజయ్‌కుమార్‌ పాణిగ్రాహి పట్టుబడ్డారు.

భారీగా గుట్కా, ముడి సరకు స్వాధీనం.. 
దాడి చేసిన రెండు యూనిట్లలోనూ 50 లక్షల రూపాయిల విలువచేసే తయారు చేసిన గుట్కా ప్యాకెట్లతో పాటు తయారీ కోసం నిల్వ ఉంచిన ముడిసరకు, రెండు బస్తాల్లో నిల్వ ఉంచిన 81 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీ టితోపాటు బరువు తూనిక యంత్రాలు, ప్యా కింగ్‌ మెషీన్లు, గుట్కా తయారు చేసే యంత్రాలు, ఎంసీ, సఫారీ–2000, గోకుల్‌తోపాటు వివి ధ బ్రాండ్‌ పేర్లు ముద్రించిన కవర్లు, యాలకులు, మసాలా దినుసులు, పొగాకు బస్తాలు, వి విధ రసాయనాలతోపాటు మూడు ద్విచక్ర వా హనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హానికర రసాయనాల వినియోగం..
గుట్కా తయారీలో హానికరమైన రసాయనాలు వినియోగిస్తున్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీనా తెలిపారు. 40 కిలోల టొబాకో కినామ్‌ పెర్‌ఫ్యూమ్, 10 కిలోల వీజెడ్‌ స్పెషల్‌ ఆయిల్, 2 కిలోల సఫారీ పెర్‌ఫ్యూమ్‌ క్యాన్లు, 20 లీటర్ల డీలక్స్‌ ఆయిల్స్, లూజ్‌ ఆయిల్స్‌లను గుట్కాలో ఉపయోగించేందుకు నిల్వ చేశారని వెల్లడించారు. గంజాయిని చుట్టు పక్కల ఉన్న కాలేజీల్లో యువతకు అమ్ముతున్నట్లు తెలిసిందని తెలిపారు. నిందితులపై గతంలో కూడా గుట్కా తయారు చేస్తూ పట్టుబడిన కేసు పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైందని వెల్లడించారు. నగరంలో ఈ తరహా యూనిట్లు గుట్టుగా నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందనీ.. వాటిపైనా త్వరలో దాడులు నిర్వహిస్తామని సీపీ మీనా స్పష్టం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి తయారీలు నిర్వహిస్తుంటే ప్రజలు సమాచారం ఇ వ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడుల్లో డీసీపీ – 1 ఎస్‌.రంగారెడ్డి, నార్త్‌ ఏసీపీ ఎస్‌పీరెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ త్రినాథ్, పీఎం పాలెం సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ వాసునాయుడు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement