
సాక్షి, విశాఖపట్నం: ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజు కిడ్నాప్ వ్యవహారంలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. అప్పలరాజే కిడ్నాప్ డ్రామా ఆడినట్లుగా పోలీసులు నిర్ధారణ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా అప్పలరాజు అడ్డంగా దొరికిపోయనట్లు పోలీసులు తెలిపారు. అప్పలరాజు తనను ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద ఆటోలో కిడ్నాప్ చేశారని తెలిపారు. ఇక తనపై హత్యాయత్నం చేయడమే కాకుండా దుండగులు రూ. 1,25,000 నగదు, బంగారం దోచుకున్నారని చెప్పాడు. అదే విధంగా తనను రుషికొండ-సాగర్ నగర్ మధ్య కొట్టి పడేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (విభేదాలే కిడ్నాప్‌కి కారణమా..?)
కుటుంబ సభ్యుల సాయంతో కేజీఎచ్‌లో చేరిన అప్పలరాజు షర్ట్‌పై ఎటువంటి రక్తపు మరకలు లేకుండా పొట్టపై రెండు కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు అనుమానాలు ఉన్న ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా అసలు కిడ్నాప్ డ్రామా బట్టబయలైంది. సీసీ కెమెరా ఫుటేజ్‌లోనూ ఆటోలో అప్పలరాజు ఒక్కడే ఎక్కినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక అప్పలరాజుపైనే అనుమానం రావటంలో అతని ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా బంగారం దొరికింది. దీంతో లక్ష రూపాయిల నగదుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అప్పుల బాధలు, ఈఎంఐ నుంచి తప్పించుకోవడానికే అప్పలరాజు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు భావిస్తున్నారు.