మెగాసిటీగా విశాఖ
- ఎన్నికల హామీల తరహాలో నగరంపై సీఎం వరాల జల్లు
- పర్యాటక, ఐటీ, ఆర్థిక, మెడికల్ హబ్‌గా మారుస్తానని ప్రకటన
- ఎయిర్‌పోర్టు, మెట్రో, అవుటర్ రింగ్ రోడ్డు అభివృద్ధికి హామీ
- 90 రోజుల్లో సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారం
- విమ్స్, ప్రాంతీయ క్రీడా కళాశాలకు రూ.80 కోట్లు మంజూరు
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. దేశంలోనే మంచి సిటీ. ఉదయం నగరంలో పర్యటిస్తుంటే చుట్టూ కొండలు..ప్రశాంతమైన వాతావరణంతో చాలా మంచి అనుభూతి కలి గింది. ఏ సిటీలో తిరిగినా ఇలాంటి అనుభూతి కలగదు. ఇక్కడున్న ప్రశాంతత ఎక్కడా దొరకదు. అందుకే విశాఖను మెగాసిటీగా మారుస్తా. పర్యాటక, ఆర్థిక, ఆరోగ్య, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతా’ అని ుుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి భేటీకి గురువారం విశాఖ వచ్చిన ఆయన వరాలు, వాగ్దానాలు కురిపించారు. విశాఖను దేశంలోనే మెగాసిటీగా తయారు చేస్తానన్నారు.
ప్రస్తుత ఎయిర్‌పోర్టును అంతర్జాతీయస్థాయిలో మారుస్తానని చెప్పారు. మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, అన్నింటికిమించి నగరంలో పలుచోట్ల ఫ్లైఓవర్లు, లింక్‌రోడ్లు, అవుటర్ రింగ్‌రోడ్లు వేస్తామన్నారు. ఈ మేరకు గురువారం జరిగిన కేబినేట్ సమావేశంలో కలెక్టర్‌తో ఈ విషయమై చర్చించినట్టు వివరించారు. నగరంతోపాటు చుట్టుపక్కల ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాల జాబితా తయారు చేయాలని ఆదేశించారు. త్వరలోనే ఈ వివరాలతో మాస్టర్‌ప్లాన్ తయారుచేసి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
గంగవరం పోర్టులో తలపెట్టిన ఎల్‌ఎన్‌టీ టెర్మినల్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసే విధంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. స్టీల్‌ప్లాంట్ ప్రస్తుతం 4 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పని చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రూపేణా రూ.700 కోట్లు వస్తోందని, ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా మరో రూ.700 కోట్లు అదనంగా వచ్చే వీలుందన్నారు. పెట్రో కారిడార్ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తామని వివరించారు.
90 రోజుల్లో పంచగ్రామాల సమస్య పరిష్కారం
- సింహాచలంలోని పంచగ్రామాల ప్రజలు పడుతున్న సమస్యకు 90 రోజుల్లో పరిష్కరించడానికి నిర్ణయించినట్టు చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌లో దీనిపై చర్చించామన్నారు. ఇరవై ఏళ్ల నుంచి బాధపడుతున్న పంచగ్రామాల ప్రజలు 1999 పాత జీవో ప్రకారం అప్పటి మార్కెట్ ధర చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించారు. ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్తామన్నారు. మొత్తం 12 వేల మందికి ప్రభుత్వ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందన్నారు.
- సింహాచలం దేవస్థానంలో నిత్యం 5వేల మందికి నిత్యాన్నదానం జరపాలని నిర్ణయించినట్టు చెప్పారు. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
- విమ్స్ ఆస్పత్రికి తక్షణం రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మూడు నెలల్లో దీన్ని అభివృద్ధి చేయడమేకాకుండా ప్రస్తుతమున్న 200 పడకలను పెంచడం, అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
- విశాఖలో ఐటీ కంపెనీలున్నందున ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందేలా చేస్తామని, ఐటీఐఆర్ తీసుకువస్తామన్నారు. గిరిజన, పెట్రోలియం వర్సిటీ, కేంద్ర ప్రభు త్వ క్యాంపస్‌లు విశాఖకు తీసుకువచ్చేం దుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతీయ క్రీడా కళాశాలకు రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
- నగరానికి సీఎం చంద్రబాబు రకరకాల హామీలు గుప్పించినప్పటికీ వీటిని తరచుగా పర్యవేక్షించి కార్యాచరణ జరిగేలా ప్రయత్నాలు చేయాల్సి ఉంది. లేకపోతే కేవలం కాగితాలకే పరిమితయ్యే అవకాశం ఉందని నగర నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోపక్క గురువారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నగర ప్రజలతోపాటు ఎయిర్‌పోర్టు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సీఎం వస్తున్నారనే సాకుతో ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చే ప్రయాణికులకు అందుబాటులో ఉండే పెయిడ్ క్యాబ్ సర్వీసులను బలవంతంగా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు చేసేదిలేక ఎయిర్‌పోర్టు నుంచి జాతీయ రహదారికి నడుచుకుని వెళ్లాల్సివచ్చింది.