రాజకీయాలను శాసిద్దాం
విశ్వబ్రాహ్మణుల చైతన్య సదస్సులో వక్తల పిలుపు
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణలో సుమారు 30లక్షల జనాభా ఉన్న విశ్వబ్రాహ్మణులు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని ఆ సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్‌లో తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రాజకీయ చైతన్య సదస్సు నిర్వహించారు. అన్ని పార్టీలు విశ్వబ్రాహ్మణులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయని, ఈసారి విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలనే బలపరచాలని వారు కోరారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్, ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి విశ్వబ్రాహ్మణులేనని వారు గుర్తుచేశారు. సదస్సులో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి, బీజేపీ ఉపాధ్యక్షుడు చారి, సంఘం అధ్యక్షుడు పోలాస నరేందర్, ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి, ఎ.కిషన్, లాలుకోట వెంకటాచారి, పులిగిల్ల రంగాచారి, దుబ్బాక కిషన్‌రావు తదితరులు హాజరయ్యారు.