Viswabrahmins
-
విశ్వ బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం అండ
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ) : రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు తోడుగా ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శనివారం విజయవాడ కబేళా సమీపంలోని శ్రీకామాక్షి ఏకాంబేశ్వర విశ్వబ్రాహ్మణ కల్యాణ మండపంలో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావుతో పాటు ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఈ నెల 9న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి వెలంపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతినిధులకు నియామక పత్రాలు అందించారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జవ్వాది కూర్మాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ కార్యాలయ నిర్మాణానికి పావులూరి రూ.18 లక్షలు, సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహారావు రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. -
పేదింటి యువతికి అండగా.. కులాంతర వివాహం
టెక్కలి: టెక్కలిలో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన నిరుపేద యువతి శ్రీదేవి వివాహానికి విశ్వబ్రాహ్మణులంతా అండగా నిలిచారు. తల్లిదండ్రుల పాత్రలో కన్యాదానం ఇచ్చారు.. కుటుంబ సభ్యులు మాదిరిగా హాజరై బ్రాహ్మణ యువకునితో వైభవంగా వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే.. టెక్కలిలోని రెడ్డికవీధికి చెందిన లక్కోజు నీలవేణి, కుమార్తె శ్రీదేవిలు నిరుపేదలు. దీంతో శ్రీదేవికి వివాహం చేసే బాధ్యతను పట్టణంలోని విశ్వబ్రాహ్మణులంతా వారి భుజాన వేసుకున్నారు. ఇదే సందర్భంలో హైదరాబాద్‌లో ఉంటున్న లోకేశ్‌శర్మ అనే బ్రాహ్మణ యువకుడు పేదింటి యువతిని వివాహం చేసుకునేందుకు ఆలోచన చేశాడు. ఈ క్రమంలో టెక్కలి మండలం సుఖదేవ్పేట గ్రామానికి చెందిన బొడ్డు ఢిల్లేశ్వరరావుకు పరిచయం కలిగిన వ్యక్తులు హైదరాబాద్‌లో ఉండడంతో వారి ద్వారా శ్రీదేవి గురించి తెలుసుకున్నాడు. టెక్కలిలో విశ్వబ్రాహ్మణ సంఘాన్ని సంప్రదించి వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో బుధవారం టెక్కలి లక్ష్మీ నృసింహా స్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది. -
రాజకీయాలను శాసిద్దాం
విశ్వబ్రాహ్మణుల చైతన్య సదస్సులో వక్తల పిలుపు హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణలో సుమారు 30లక్షల జనాభా ఉన్న విశ్వబ్రాహ్మణులు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని ఆ సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం సికింద్రాబాద్‌లో తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రాజకీయ చైతన్య సదస్సు నిర్వహించారు. అన్ని పార్టీలు విశ్వబ్రాహ్మణులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయని, ఈసారి విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలనే బలపరచాలని వారు కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్, ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి విశ్వబ్రాహ్మణులేనని వారు గుర్తుచేశారు. సదస్సులో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి, బీజేపీ ఉపాధ్యక్షుడు చారి, సంఘం అధ్యక్షుడు పోలాస నరేందర్, ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి, ఎ.కిషన్, లాలుకోట వెంకటాచారి, పులిగిల్ల రంగాచారి, దుబ్బాక కిషన్‌రావు తదితరులు హాజరయ్యారు.