
జనవరి 1కి 18 ఏళ్లు నిండేవారంతా ఓటరుగా నమోదుకండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీకల్లా 18 సంవత్సరాలు వయస్సు నిండే యువతీ, యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేకించి ఈనెల 15వ తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపడుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.
ఈ నెల 15న పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని, దానిని పరిశీలించి పేర్లులేని అర్హులందరూ ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు ఓటర్ల నమోదుకోసం దరఖాస్తులను, అలాగే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులతోపాటు అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరించనున్నట్లు భన్వర్‌లాల్ వివరించారు. ఈ నెల 19, 26 తేదీల్లో ప్రత్యేకించి గ్రామసభల్లోను, పట్టణ స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేసే సమావేశాల్లో జాబితాలో పేర్లను చదివి వినిపిస్తారని, ఆ సందర్భంగా పేర్లలో పొరపాట్లుంటే సరిచేసుకోవాలని సూచించారు.
అలాగే ఈ నెల 17, 24 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఆఫీసర్లు, రాజకీయపార్టీల ఏజెంట్లతో సమావేశాలు నిర్వహిస్తారని, ఆ సమావేశాల్లో ఓటరుగా నమోదుకు దరఖాస్తులను, అలాగే అభ్యంతరాలకు సంబంధించిన అంశాల్ని స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్లుగా నమోదుకోసం వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలకు సంబంధించిన అంశాలను వచ్చే నెల 16వ తేదీకల్లా పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీకల్లా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేస్తారని, జనవరి 16న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారని వివరించారు. ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ జాబితా ఆధారంగానే వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం, తరువాత వరదలు కారణంగా గత నెలలో జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికి వాయిదా పడింది.