సాక్షి, కరీంనగర్ : వీఆర్వో, వీఏవో పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు శనివారం నోటిఫికేషన్ వెలువడుతుందని ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. వీఆర్వో, వీఏవో నియామకాల ప్రక్రియ గురించి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుందని అన్నారు. జిల్లాలో 83 వీఆర్వో, 223 వీఏవో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 2న పరీక్ష జరుగుతుందని, జిల్లావ్యాప్తంగా 170 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 20న ఫలితాలు వెల్లడిస్తామని, 26న నియామకాలు జరుగుతాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఆర్వో కె.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
దరఖాస్తులు ఇలా...
దరఖాస్తులను మీసేవ, ఈసేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా పంపాలి. http://ccla.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తుతో ధ్రువపత్రాలు జత చేయాల్సిన అవసరంలేదు, కానీ అన్ని వివరాలు నింపాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ఆయా కేంద్రాల నుంచే అప్‌లోడ్ చేయాలి.
ఫీజు వివరాలు...
ఒక్కో పోస్టుకు రూ.300 చెల్లించాలి. ఒక్కరే రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే రెండిం టికి విడివిడిగా ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయితే రూ.150 మాత్రమే చెల్లిం చాలి. వికలాంగులు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. దరఖాస్తులను అప్‌లోడ్ చేసేందుకు రూ.20 సర్వీస్ చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష ఎలా...
పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. 100 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 60 జనరల్ స్టడీస్, 30 ఆర్థిమెటిక్స్, 10 లాజికల్ స్కిల్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్ ప్రశ్నల్లో 30 గ్రామీణ పరిస్థితులు, గ్రామీణ జీవనంపై ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది.
అర్హతలు...
వీఆర్వో పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్. ఈ పోస్టులకు జిల్లావాసులు మాత్రమే అర్హులు. వీఆర్‌ఏ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత అవసరం. సొంత రెవెన్యూ గ్రామ పరిధిలోని వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీఆర్వో పోస్టులకు జూలై 1నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. వీఆర్‌ఏ పోస్టులకు 18 నుంచి 37 ఏళ్ల వరకు వయస్సు ఉండవచ్చు. రెండు పోస్టులకు అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్ల సడలింపు ఇచ్చారు.
వీఆర్వో, వీఏవో పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్
Published Sat, Dec 28 2013 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement