మన ప్రభుత్వం వస్తుంది, ఓపిక పట్టండి: జగన్
నరసాపురం : నాలుగు నెలలు ఓపిక పట్టండి..మన ప్రభుత్వం వస్తుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులు, మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. రైతుల రుణాలు మాపీ చేయాలని.. కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం స్పందించినా...స్పందించకున్నా..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అండగా ఉంటుందని చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లాలో హెలెన్ బాధితులకు ధైర్యం చెప్పి.. వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతలకు భరోసా ఇవ్వడానికి వచ్చారు . నరసాపురం నుంచి బయల్దేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్మణేశ్వరం, సార్వా గ్రామాల్లో హెలెన్ దెబ్బకు నాశనమైన వరిని పరిశీలించారు. ఒక నెలలో రెండు తుపాన్‌లు తమను రోడ్డున పడేశాయని రైతులు వాపోయారు. పంట పూర్తిగా కొట్టుకుపోయినా..తమనెవరూ పట్టించుకోలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మణేశ్వరం దేవుని తోటలో తుపాను తాకిడికి దెబ్బతిన్న ఇళ్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఎంత పెట్టుబడి పెట్టారు... ఎంత రాబడి వచ్చిందని రైతులను అడిగి తెలుసుకున్నారు. కుళ్లిపోయిన వరి పంటను..వరి ధాన్యాన్ని అన్నదాతలు చూపించారు. అంతేకాదు...నడవలేని వృద్దులు కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చూడటానికి రోడ్డెక్కారు. వారిని పెన్షన్లు, ఆరోగ్య శ్రీ గురించి అడిగి తెలుసుకున్నారు .