డ్వాక్రా రుణాల వసూలుకు ప్రత్యేక బృందాలు
రాజాంరూరల్ : జిల్లాలో డ్వాక్రా రుణాల వసూళ్లకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నామని జిల్లా సమాఖ్య ఆర్థిక శాఖ డీపీఎం జి.ఎస్.తారాదేవి స్పష్టం చేశారు. బుధవారం ఆమె రాజాంలోని ఐకేపీ కార్యాలయంలో మండల సమాఖ్య రికార్డులను సామాజిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు సామాజిక పెట్టుబడి నిధి, స్వర్ణ జయంతి సామాజిక పెట్టుబడి నిధి, సమగ్ర సహకార అభివృద్ధి పథకం, ఆరోగ్యం-పోషణ తదితర విభాగాల పేరుతో జిల్లాలోని సుమారు 32 వేల మంది డ్వాక్రా మహిళలకు సుమారు రూ.31.49 కోట్ల రుణాలు అందించినట్టు చెప్పారు. సెప్టెంబర్ నాటికి వీటిలో 53 శాతం రుణాలు వసూలైనట్టు తెలిపారు.
రాజాంలో సుమారు రూ.12 కోట్ల రుణాలు ఇవ్వగా ఇప్పటివరకు 31 శాతం మాత్రమే రికవరీ అయ్యాయన్నారు. నూరుశాతం రుణాల వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు సీఆర్పీలతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. మొండి బకాయిల వసూళ్లే బృందాల ప్రధాన లక్ష్యమన్నారు. బ్యాంకు లింకేజీలకు మినహా ప్రభుత్వం అమలు చేయబోయే రుణాల మాఫీ ఇంక దేనికీ వర్తించదని, సభ్యులు ఈ విషయాన్ని గమినించాలని కోరారు. జిల్లాలో 31 మండలాలకు సంబంధించి రాజాం, ఎచ్చెర్ల, నరసన్నపేట, టెక్కలి, సోంపేట, పాలకొండ ప్రాంతాల్లో క్లస్టర్లు ఉన్నాయని, పాతపట్నం, సీతంపేట క్లస్టర్లు ఐటీడీఏ పరిధిలోకి వెళతాయని అన్నారు. ఆర్థిక శాఖ ఏపీఎం పి.శ్రీనివాసరావు, రాజాం క్లస్టర్ ఏసీ జి.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.