గూగుల్‌లో వరంగల్ | warangal data base is in google maps | Sakshi
Sakshi News home page

గూగుల్‌లో వరంగల్

Published Mon, Sep 2 2013 4:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

warangal data base is in google maps

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వరల్డ్ హెరిటేజ్ సిటీగా ఇప్పటికే ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం దక్కించుకున్న వరంగల్ మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. మరో కొన్ని గంటల్లో అరుదైన ఘట్టాన్ని చేరుకోనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లా భౌగోళిక స్వరూపం ప్రపంచం ముంగిట్లోకి వెళ్లనుంది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, రోడ్లు, భవనాలు, ప్రభుత్వ కార్యాలయూలు, ఆస్పత్రులు, గ్రామాల ఛాయూచిత్రాలను గూగుల్‌లో ప్రత్యక్షంగా వీక్షించే అద్భుత గడియ రానే వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘వరంగల్ ఆన్‌లైన్’ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్‌జాజ్, కలెక్టర్ కిషన్, గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ లతిటేష్ కాట్రగడ్డ, న్యూ బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ కిరణ్‌బాప్న, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ డెరైక్టర్ సురేన్ రేహలా హాజరుకానున్నారు.
   
 హైదరాబాద్ తర్వాత  జిల్లాకే..
 రాష్ర్ట రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లాకే ఈ అవకాశం దక్కనుంది. కాకతీయుల ఖిల్లా, రామప్ప చెరువు, వరంగల్‌లోని విద్య, వైద్య సముదాయాలు, వారసత్వ కట్టడాలను గూగుల్ వెబ్‌సైట్ నుంచి మనం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. జిల్లాలోని ప్రధాన రహదారులు, పర్యాటక ప్రాంతాలు, జలాశయాలు, రెవెన్యూ గ్రామాలు, సహజ వనరులన్నింటినీ ఎన్‌ఐటీ, జవహర్ నాలెడ్జ్ సెంటర్ విద్యార్థుల సహాయంతో గూగుల్ విజ్వలైజ్ చేసింది. విజువల్స్ కోసం అధునాతన 3డీ టెక్నాలజీని ఉపయోగించారు. జిల్లా అంతకు ముందు పనిచేసిన కలెక్టర్ రాహుల్‌బొజ్జా హయాంలో గూగుల్ విజువలైజేషన్ కార్యక్రమం చేపట్టగా... ఇప్పటి కలెక్టర్ జి.కిషన్ ఆధ్వర్యంలో గూగుల్ ద్వారా ‘వరంగల్ ఆన్‌లైన్’ అందుబాటులోకి రానుంది.
 
 మంత్రి పొన్నాల చొరవ..
 జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్‌ను గుగూల్‌లో చూపించేందుకు ప్రత్యేక చొరవ చూపించారు. గూగుల్ సంస్థ ప్రతినిధులకు అందుకు కావాల్సిన సహకారాన్ని ఆయన అందించారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదేశాలతో జిల్లాలోని సమగ్ర సమాచారాన్ని క్రోఢీకరించడంలో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా... అధికార యత్రాంగాన్ని భాగస్వాములను చేశారు. రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో విలేజ్ రెవెన్యూ, సర్వేల్యాండ్ అధికారుల సహకారంతో భౌగోళిక స్వరూపాన్ని గుగూల్‌లో పొందుపరిచారు.
 51 మండలాల సమాచారం జిల్లాలోని 51 మండలాల్లో ఉన్న 1066 గ్రామాలు, 10వేల ప్రాంతాలు, 700 ప్రధాన రోడ్లు ‘వరంగల్ ఆన్‌లైన్’లో కనిపిస్తాయి. ఇవేగాక ఖిలావరంగల్ కోట, వేరుుస్తంభాలగుడి, రామప్ప గుడి, కోటగూళ్లు, పాకాల, లక్నవరం సరసులు, కాకతీయ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) , ఎంజీఎం, కాకతీయ మెడికల్ కళాశాల, కాజీపేట రైల్వే స్టేషన్... ఇలా అనేక చారిత్రక ప్రదేశాలు, పురావస్తు కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ‘వరంగల్ ఆన్‌లైన్’లో ప్రత్యక్షంగా కనిపించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement