
శ్రీకాకుళం పాతబస్టాండ్: వచ్చే విద్యా సంవత్సరం నాటికి జిల్లాలో అన్ని పాఠశాలలకు రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో నీటి సౌకర్యం ఏర్పాటుపై సంబంధిత అధికారులతో గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరంతర నీటి సరఫరా లేని పాఠశాలలను గుర్తించి అందుకు తగిన అంచనాలు రూపొందించాలన్నారు.
మరుగుదొడ్లకు నీటి సరఫరా ఉంటే విద్యార్థులు వినియోగించుకునేందుకు వీలుగా ఉంటుందని చెప్పారు. జిల్లాలో 739 పాఠశాలల్లో నీటి వసతులు ఉన్నాయని, అయితే ట్యాంకులు, పైపులైన్లు లేకపోవడం, మోటారు పనిచేయకపోవడం వంటి కారణాలతో నిరంతర నీటి సరఫరా ఉండటంలేదని సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి ఎస్.త్రినాధరావు తెలిపారు. సమావేశంలో డీఈఓ ఎం.సాయిరాం, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ టి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు, ఈడబ్ల్యూఐడీసీ కార్యనిర్వాహక ఇంజినీర్ కె.భాస్కరరావు, సర్వశిక్ష అభియాన్ కార్యనిర్వాహక ఇంజనీర్ పి.సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment