
సాక్షి,విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కడలి వైపు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో నీరు వస్తుండగా, అవుట్ ఫ్లో 2.50 లక్షల క్యుసెక్కులుగా నమోదైంది. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు బ్యారేజీలోని డెబ్బై గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశాయానాకి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులోని 6 క్రస్ట్ గేట్టను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. పశ్చిమ గోదావరి పోలవరం వద్ద గోదావరి ఉధృత తగ్గి ప్రస్తుత నీటి మట్టం 11.38 మీటర్లుగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 19 గ్రామాలు ఇంకా జలదిగ్బందంలోనే కొనసాగుతున్నాయి.