కోట్లు కుమ్మరిస్తున్నా తాత్కాలిక ఉపశమనమే
నత్తనడకన హంద్రీ-నీవా కానరాని ఎన్టీఆర్ సుజల స్రవంతి
శాశ్వత పరిష్కారానికి చొరవ చూపని ప్రభుత్వం
జిల్లాలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం శాశ్వత పరిష్కారానికి చొరవ చూపడం లేదు. హంద్రీ-నీవా పూర్తిచేసి నీళ్లు తెస్తామంటూ నేతలు ఊదరగొడుతున్నా, భూసేకరణ అడ్డంకులే తొలగని ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రారంభమైన కండలేరు నీటి పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. ఇదిలా ఉండగా, నెలకు రూ.7 కోట్లు వెచ్చించి 2400 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఇందులో సగం నిధులు అధికార పార్టీ నేతల జేబుల్లోకి చేరుతున్నాయనే ఆరోపణలున్నాయి.
చిత్తూరు: జిల్లాలో నీటి ఎద్దడికి ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో దాదాపు రూ.300 కోట్లు ఖర్చుచేసినట్లు చెబుతున్నా.. ఆ మేరకు నీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. జిల్లావ్యాప్తంగా 18,848 చేతిపంపులతో పాటు 2,181 డెరైక్ట్ పంపింగ్ స్కీమ్స్, 439 మినీ పీడబ్ల్యూఎస్, 6,039 పీడబ్ల్యూఎస్, 5 సీపీడబ్ల్యూఎస్ పథకాలున్నా.. తీవ్ర వర్షాభావంతో వీటిలో సగం కూడా పనిచేయకుండా నిలిచిపోయాయి. దాదాపు 2,400 గ్రామాలకు ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ఇందుకోసం నెలకు రూ.7 కోట్ల వరకు వెచ్చించారు. 2014 జూన్ మొదలు 2015 నవంబర్ వరకు నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. 2014 ఏప్రిల్ నుంచి 2015 నవంబర్ నాటికే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం రూ.73.77 కోట్ల నిధులు వెచ్చించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవికాక తాగునీటి పథకాల మరమ్మతులు, కొత్త బోరుబావుల తవ్వకం, మోటార్ల ఏర్పాటు తదితర వాటికి రూ.150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా బాబు రెండేళ్ల పాలనలో జిల్లాలో తాగునీటి కోసం రూ.300 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపి ఈ నిధుల్లో చాలామేరకు అధికార పార్టీ నాయకులు స్వాహా చేసినట్టు సమాచారం. హంద్రీ-నీవా పూర్తి చేసి ఏడాదిలోనే నీళ్లిస్తానని చంద్రబాబు పదే పదే చెప్పినా అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. హంద్రీ-నీవాకు భూసేకరణ అడ్డంకులే ఇంకా తొలగలేదు. ఇక ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రతి గ్రామానికి మంచినీరు ఇస్తానని బాబు హామీ ఇచ్చినా ఆ హామీ గంగలో కలిసింది. జిల్లాలో 100 గ్రామాల్లో కూడా ఈ పథకం అమలు కావడం లేదు. నవంబర్‌లో వర్షాలు కురవకపోతే జిల్లాలో తాగునీటి సమస్య ఊహించడమే కష్టంగా ఉండేది. నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నా నీరు దొరికే పరిస్థితి కనిపించేది కాదు.
కండలేరు పథకాన్ని పక్కన పెట్టిన బాబు
జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో రూ.7,390 కోట్లతో కండలేరు తాగునీటి పథకానికి రూపకల్పన చేశారు. జిల్లావ్యాప్తంగా రూ.5,990 కోట్లు వెచ్చించి 52 మండలాల పరిధిలో 8,468 గ్రామాలకు తాగునీరందించాలనేది లక్ష్యం. మొదటి ఫేజ్‌లో జిల్లాలోని తిరుపతి, తిరుమల, చిత్తూరు, మదనపల్లి, పీలేరు,పలమనేరు, పుంగనూరు మండలాల పరిధిలోని గ్రామాలకు తాగునీరందించాల్సి ఉంది. ఈ నీటిపథకం కోసం కండలేరు నుంచి చిత్తూరు జిల్లాలోని కలవకుంట ఎన్‌టీఆర్ జలాశయం వరకు 168 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి రేణిగుంట వద్ద 420 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటిశుద్ధి కేంద్రం నిర్మించాలని నిర్ణయించారు. రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాగునీటి పథకం పనులు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రపదేశ్(ఇన్‌క్యాప్)కు అప్పగించారు. తొలివిడతలో రూ. 4,300 కోట్ల పనులు 12 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు కూడా పిలిచారు. ఇందుకోసం ఇన్‌క్యాప్ కాంట్రాక్టర్లకు అడ్వాన్సుల కింద రూ.40 కోట్లు చెల్లించింది. ఈ పథకం కోసం కండలేరు జలాశయం నుంచి 6.61 టీఎంసీ నీటిని కేటాయిస్తూ అప్పట్లో కిరణ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో నీటి కేటాయింపులు ఎలా ఉన్నా కృష్ణాజలాలు తమిళనాడుకు ఇవ్వాలన్న ఒప్పందం నేపథ్యంలో కండలేరులో నిత్యం నీళ్లు నిలువ ఉంటాయి.
భవిష్యత్తులో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే కిరణ్ సర్కార్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. దీనిపై నెల్లూరు జిల్లాలో వ్యతిరేకత వచ్చినా తాగునీటి సమస్య పరిష్కారం కోసమంటూ అప్పట్లో కిరణకుమార్‌రెడ్డి ఆ జిల్లా నేతలకు నచ్చజెప్పి ఒప్పించారు. ఈ పథకం వల్ల వేలాది గ్రామాలకు తాగునీరు అందించే అవకాశమున్నా పథకాన్ని పూర్తి చేస్తే కమీషన్లు రాకపోగా గత ప్రభుత్వానికి పేరు వస్తుందన్న అక్కసుతో చంద్రబాబు ఈ పథకాన్ని రద్దు చేశారు. భవిష్యత్తులో నీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.