
శాంతించిన సముద్రం
తగ్గిన అలల ఉధృతి
వెయ్యి లారీల బండరాళ్ల లోడ్లు డంపింగ్
లారీ బోల్తా : డ్రైవర్ క్షేమం
విశాఖపట్నం సిటీ: సముద్రం శనివారం శాంతించింది. అలల ఉధృతి కాస్త తగ్గింది. దీంతో జిల్లా యంత్రాంగం ఊపిరితీసుకుంది. మూడు రోజులుగా అలలు ఉధృతంగా ఎగసి పడడంతో బీచ్ రోడ్డులో తీరం 20 అడుగుల వరకు కోతకు గురైన విషయం తెలిసిందే. కోతకు గురైన ప్రాంతాన్ని జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ చేసి 13 వేల క్యూబిక్ మీటర్ల మేర బండరాళ్లను వేయాలని నిర్ణయించారు. శనివారం రాత్రి నాటికి నాలుగు క్యూబిక్ మీటర్లు మాత్రమే రాళ్లను నింపినట్టు గుర్తించారు. మరో వారం పాటు నిరంతరంగా రాళ్లను తీరంలో వేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది. రోజుకు 2 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున తీరాన్ని రాళ్లతో నింపాల్సిందిగా సూచించారు.
లారీ బోల్తా: బీచ్ రోడ్డు నుంచి తీరంలోకి బండరాళ్లను డంప్ చేస్తున్న ఓ లారీ బోల్తా పడింది. శనివారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పుతోందని గ్రహించిన డ్రైవర్ వెంటనే కిటికిలోంచి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు భారీ క్రేన్ల సాయంతో 30 అడుగుల లోతులో ఉన్న లారీని బయటకు తీశారు.