ఎంసెట్ కౌన్సెలింగ్‌కు మేం సిద్ధం
జీవోలు రాకపోవడంతో నిర్వహించలేదు
ఉన్నత విద్యామండలి ఇంప్లీడ్ పిటిషన్
ఏపీ మండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి శుక్రవారం సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. జూలై 31లోపే కౌన్సెలింగ్ ప్రక్రియ ముగించాల్సి ఉన్నప్పటికీ నిర్వహించకపోవడానికి గల కారణాలనూ ఆ పిటిషన్‌లో పేర్కొంది. అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహణకు అక్టోబర్ 31 వరకు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆ కేసు ఆగస్టు 4కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణలో తమను కూడా చేర్చాలని తాజాగా ఉన్నత విద్యామండలి ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి ఢిల్లీలో మీడియాకు వివరించారు. ఆయనేం చెప్పారంటే...
మాకు తగిన యంత్రాంగం ఉంది. మేం అడ్మిషన్లు నిర్వహించుకుంటామని కోరాం. కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించాల్సిన అధీకృత సంస్థ మాది. చాలా సంవత్సరాలుగా ఇతర అధికారులు అవసరం లేకుండానే కౌన్సెలింగ్ నిర్వహించాం. మాకు కావాల్సింది 57 హెల్ప్‌లైన్ సెంటర్లు. ప్రొఫెసర్లు, లెక్చరర్లు. వాళ్ల ద్వారా అడ్మిషన్లు జరిగిపోతాయి. అదనపు అధికారుల అవసరం మాకు లేదని చెప్పాం.
పాలిటెక్నిక్ లెక్చరర్లు తాము విధుల్లో పాల్గొనబోమని చెప్పారు. కాబట్టి నాలుగో తేదీ ఎలా ఉంటుందన్నది చూడాలి. ఒకవేళ సుప్రీం కోర్టు రెండు రాష్ట్రాలు మండలికి సహకారం అందించాలని ఆదేశిస్తే.. ఒక అడుగు ముందుకు పడ్డట్టే. ముఖ్యంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రకటించాం. దానికి దాదాపు 15 రోజులు పడుతుంది. కోర్టు నిర్ణయం వచ్చేలోపు ఆ ప్రక్రియ పూర్తిచేసుకుంటే పిల్లలకు ఇబ్బంది ఉండదు. ఆ ఉద్దేశంతోనే ప్రకటన జారీచేశాం. వేరే దురుద్దేశం లేదు.
మేం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. రెండు రాష్ట్రాలకు లేఖలు పంపించాం. సమావేశానికి తెలంగాణ అధికారులు కూడా వచ్చారు. లోతుగా చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడం గానీ, మరొక ప్రభుత్వానికి అనుకూలంగా పోవడం గానీ లేదు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రకటన జారీచేశాం.
మేం అటానమస్ అయినప్పటికీ ప్రభుత్వం చెప్పినట్టు మేం వినాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్, మిగిలిన కొన్ని విషయాల్లో ప్రభుత్వ సహకారంతో జరుగుతాయి. అన్నీ చర్చించే నిర్ణయం తీసుకున్నాం. సుప్రీం కోర్టు ఆదేశాలతో అన్నీ సర్దుకుంటాయని ఆశిస్తున్నాం.
జూలై 31లోపు అడ్మిషన్లు నిర్వహించాలి. మీరు ఎందుకు అడ్మిషన్లు నిర్వహించలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించే ఆస్కారం ఉంది. అందువల్ల మేం ఇంప్లీడ్ అయ్యాం. మేం చేయలేకపోవడానికి కారణాలు వివరిస్తాం. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఐదో తేదీన మరోసారి సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను పక్కనబెట్టి తెలంగాణ వరకు అడ్మిషన్లు నిర్వహించడం కష్టమే. కౌన్సెలింగ్ ప్రక్రియపై గవర్నర్‌కు తెలిపాం.