
రాజధాని రైతులకు అండగా ఉంటాం: వైఎస్ జగన్
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ప్రజల మనసుకు వ్యతిరేకంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ఉండవల్లి : రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ప్రజల మనసుకు వ్యతిరేకంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం ఉండవల్లి గ్రామంలో పర్యటించి పంటపొలాలను పరిశీలించారు. అనంతరం వైఎస్ జగన్..రాజధాని ప్రాంత రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతులకు ఇష్టం లేకుండా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేయటం సరికాదన్నారు. రైతులకు అండగా, తోడుగా వైఎస్ఆర్ సీపీ మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తుందన్నారు. మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిరాహార దీక్ష చేశారని, అలాగే రైతులకు భరోసా కల్పించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాతో పాటు పాదయాత్ర చేశారని వైఎస్ జగన్ చెప్పారు.
ఇక రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా, దేశవ్యాప్తంగా అందరికీ అవగాహన ఉందన్నారు. బహుళ పంటలు పండే భూమిని ప్రభుత్వానికి ఆ హక్కును కట్టబెట్టేలా చేసే సవరణలను వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకించదన్నారు. కేంద్ర స్థాయిలో కూడా భూసేకరణ చట్టంలో సవరణలను వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకిస్తోందన్నారు.