ఉద్యోగుల సమ్మె మీద ఎస్మా ప్రయోగించినా వెనక్కితగ్గే ప్రసక్తే లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించాలనుకుంటే ఉద్యోగులను పెట్టడానికి జైళ్లు సరిపోవన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఉద్యోగులను అణచివేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టినా వెరవమని చెప్పారు. ‘నో వర్క్.. నో పే’ కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రభుత్వం ఈ విధానాన్నే అవలంబించిందని గుర్తు చేశారు. సమ్మె కాలానికి జీతం వస్తుందా రాదా అన్న ఆలోచన సీమాంధ్ర ఉద్యోగుల్లో లేదన్నారు. ఇది జీతం కోసం చేస్తున్న ఉద్యమం కాదని, జీవితం కోసం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే దిశగా స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా వేయండి
ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని అశోక్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మె వల్ల ప్రభుత్వ, రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందన్నారు. ‘విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయడానికి రెవెన్యూ వ్యవస్థ పనిచేయడం లేదు. విద్యార్థులు గ్రామాల నుంచి కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరుకోవడానికి రవాణా వ్యవస్థ లేదు. కౌన్సెలింగ్‌లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే ఒక సెంటర్ నుంచి మరో సెంటర్‌కు వెళ్లడం సాధ్యమయ్యే పనికాదు. ఈ పరిస్థితుల్లో కౌన్సెలింగ్ వాయిదా వేయకుంటే విద్యార్థులు నష్టపోతారు’ అని పేర్కొన్నారు. వాయిదా వేయడం కొత్తకాదని, తెలంగాణ ఉద్యమం సమయంలోనూ వాయిదా వేశారని గుర్తు చేశారు.