'సీఎం కిరణ్ నోటిస్ తో సంబంధం లేదు'
సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 77వ నిబంధన కింద ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. ఈ మేరకు ఒక లేఖను ఆయనకు అందజేశారు. ఆర్టికల్ 208 ప్రకారం శాసనసభ నిర్వహణ నిబంధనావళి శాసనసభకు సంబంధించిన అంశాలకు మాత్రమే వర్తిస్తుందని, పార్లమెంట్ వ్యవహారాలకు వర్తించేది కాదని అందులో పేర్కొన్నారు. ప్రస్తుత బిల్లు కేవలం పార్లమెంటు నిర్ణయించడానికి ఉద్దేశించింది మాత్రమేనని, శాసనసభకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
ఆదివారం సాయంత్రం మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో సమావేశానంతరం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు స్పీకర్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యూరు. ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా నోటీసు ఇచ్చినట్టు పత్రికల్లో చూశానని, మంత్రిమండలి సమష్టిగా తీసుకున్నదే ప్రభుత్వ నిర్ణయమవుతుందని, ఏ ఒక్క మంత్రి లేదా ముఖ్యమంత్రి తనకు తాను ప్రభుత్వం అని అనుకోవడానికి వీల్లేదని దామోదర పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులెవరినీ సంప్రదించకుండా నోటీసు ప్రతిపాదించడం తీవ్ర అభ్యంతరకరమని, సమష్టి బాధ్యత అన్న స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తీర్మానం రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడును అడ్డుకోవడమే అవుతుందని, అందువల్ల స్పీకర్ బిజినెస్ రూల్స్ 81 ప్రకారం సీఎం నోటీసును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.