చిత్తూరు: చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం కూలీలు ఎన్ కౌంటర్ అయిన ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం మంగళవారం పరిశీలించింది. ఎన్కౌంటర్ పై ఇప్పుడే నివేదిక ఇవ్వలేమని ఎన్హెచ్ఆర్సీ బృందం తెలిపింది. ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు దత్తు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో పరిశీలించింది.
అన్ని విభాగాల అధికారులను విచారణ చేస్తున్నామని, సమగ్ర నివేదికను కమిషన్కు సమర్పిస్తామని దత్తు తెలిపారు. నాలుగు రోజుల పాటు తిరుపతిలోనే ఉంటామని, ఉన్నతాధికారుల నుంచి అన్ని నివేదికలు తెప్పించుకుంటామని చెప్పారు. సచ్చినోడిబండ, చిగటీగలకోన ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించింది. ఏప్రిల్ ఏడో తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే.