
ఆంధ్రప్రదేశ్‌కు వెంకయ్య గర్వకారణం
ఆంధ్రప్రదేశ్‌కు వెంకయ్యనాయుడు గర్వకారణమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి.విజయ సాయిరెడ్డి అన్నారు.
► రాజ్యసభ చైర్మన్‌గా స్వాగత చర్చలో విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు వెంకయ్యనాయుడు గర్వకారణమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి.విజయ సాయిరెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈసందర్భంగా రాజ్యసభలో ఆయనకు స్వాగతం పలికే చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. వెంకయ్యనాయుడు స్ఫూర్తితో తాను హిందీలో ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నానని.. తొలుత హిందీలో ప్రసంగించారు.
అనంతరం ఆంగ్లంలో విజయసాయిరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచారు. ఎమర్జెన్సీ కాలంలో మీరు చేసిన పోరాటం మరువలేనిది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుడిగా మీ పనితీరు చరిత్రాత్మకం. ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని మరిచిపోలేరు. మీ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీలో ఉండటమనేది కొద్ది మందికి మాత్రమే సాధ్యం. ఉపరాష్ట్రపతిగా మీరు దేశానికి గొప్ప నాయకత్వం వహిస్తారని నమ్ముతున్నాం. నేను, మా పార్టీ, మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం’ అని పేర్కొన్నారు.