సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని గవర్నర్ సలహాదారు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎ.ఎన్.రాయ్ స్పష్టం చేశారు. సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన రాయ్ గురువారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో లోక్‌సభతోపాటు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున శాంతిభద్రతల అంశాన్ని సవాలుగా తీసుకుంటున్నామని చెప్పారు. పండుగలు, ఎన్నికలు నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటామని పేర్కొన్నారు. పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్షను ఎప్పుడు నిర్వహించేది ప్రభుత్వం నేడో రేపో వెల్లడిస్తుందని రాయ్ చెప్పారు.
పీజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగినందునే రద్దుకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఒకవైపు రాష్ట్ర విభజన, మరోవైపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సమాంతరంగా జరుగుతున్నాయని, అన్నీ సజావుగా కొన సాగేలా అవసరమైన సలహాలు, సూచనలు చేస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో సాధారణ పరిపాలన ఎటువంటి అవాంతరాల్లేకుండా కొనసాగేలా చూస్తామన్నారు. అంతకుముందు రాయ్ సాధారణ పరిపాలనశాఖ అధికారుల నుంచి ఏ ప్రాంతంలో ఎన్నికలు ఏ తేదీన ఉన్నాయనే వివరాలను తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా రాయ్‌ను గురువారం ఉదయం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు.
డీజీపీతో రాష్ట్ర శాంతిభద్రతలపై ఆరా...
గవర్నర్ సలహాదారులు ఎ.ఎన్. రాయ్, సలావుద్దీన్ అహ్మద్‌లతో గురువారం సచివాలయంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు సమావేశమయ్యారు. డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డి, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్‌కే కౌముదితోసహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై గవర్నర్ సలహాదారులు ఆరా తీశారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ముగిశాయని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బందోబస్తుతోపాటు, సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఆ బందోబస్తుకూ కసరత్తు పూర్తి చేశామని డీజీపీ వారికి వివరించినట్టు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలీసుశాఖలో విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, కొన్ని అంశాలపై కసరత్తు సాగుతున్నదని కూడా అధికారులు తెలిపారు. 1975 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, మహారాష్ట్ర మాజీ డీజీపీ అయిన రాయ్ ఈ సందర్భంగా రాష్ట్రంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నట్టు తెలిసింది.