పెట్టె ‘లోగుట్టు’ బయట పెట్టేనా..?
► పోలీసుల సదస్సులోని సీక్రెట్ బాక్సు తెరిచిన డీజీపీ
► నివేదికివ్వాలని అదనపు డీజీపీ, ఇన్‌చార్జి ఐజీకి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అసలే క్రమశిక్షణ కల్గిన పోలీసు విభాగం అది. పై అధికారులపై ఫిర్యాదు చేసినా, సలహాలిచ్చినా ‘టార్గెట్’ చేసే పరిస్థితి! మరి ఈ నెల 19న హెచ్‌ఐసీసీలో జరిగిన పోలీస్ సదస్సులో సీఎం సూచనతో ఏర్పాటు చేసిన ‘సీక్రెట్ బాక్స్’లో వేసిన కాగితాల్లో ఎవరేం రాశారు? సమస్యలు చెప్పారా? సలహాలిచ్చారా? ఫిర్యాదులు చేశారా? ఇప్పుడు పోలీస్ శాఖలో దీనిపైనే పెద్ద చర్చ జరుగుతోంది. పోలీస్ శాఖ పనితీరులో రావాల్సిన మార్పులు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, పనితీరుపై సలహాలు, సూచనలివ్వాలని సీఎం సదస్సులో పేర్కొన్నారు.
ప్రతి అధికారి భయపడకుండా సలహాలు, సూచనలు, ఫిర్యాదులు బాక్స్‌లో వేయాలని సూచించారు. చాలామంది ఎస్సై, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు తమ ఫిర్యాదులు, పోలీస్ శాఖలోని కీలక సమస్యలను రాసి బాక్స్‌లో వేసినట్టు తెలిసింది. ఈ బాక్స్ సోమవారం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయానికి చేరింది. డీజీపీ అనురాగ్ శర్మ ఈ పెట్టెను తెరిచారు. బాక్స్‌లో ఉన్న ప్రతీ పేజీలోని అంశాలను నివేదికగా పొందుపరిచి తనకు అందించాలని అదనపు డీజీపీ అంజనీకుమార్, ఇన్‌చార్జి ఐజీ రమేశ్‌రెడ్డిలను డీజీపీ ఆదేశించారు.
పైఅధికారుల తీరుపై విసుగు చెందిన కింది స్థాయి సిబ్బంది ఫిర్యాదులను పోలీస్ శాఖ పరిగణిస్తుం దా? పరిగణిస్తే వాటిని సీఎంతో చర్చిస్తారా? అన్న అంశంపై అధికారులు చర్చిం చుకుంటున్నారు. పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించాక సీఎంతో సమావేశమై రాసిచ్చిన అంశాలపై చర్చిస్తామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు.