బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ :
తెలంగాణ నోటు అసెంబ్లీలో ఆమోదానికి వస్తే దానిని తిరస్కరిస్తామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. శుక్రవారం బుట్టాయగూడెంలో నాన్‌పొలిటికల్, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు బాలరాజును కలిశారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని, తద్వారా విభజన నోటు అసెంబ్లీలో తీర్మానానికి వస్తే దానిని తిరస్కరించాలని కోరుతూ వారు బాలరాజుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షలు చేశారన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్య శంఖారావ బస్సు యాత్ర నిర్వహించారన్నారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ విజయమ్మ లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. విభజన ముందే తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఉద్యమాల్లో పాల్గొంటూ సమైక్య నినాదాలతో యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందన్నారు. గత 58 రోజులుగా సీమాంధ్రలో ఎంతో శాంతియుతంగా హింసకు తావులేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాన్ని నడిపిస్తుండడాన్ని అభినందించారు. సమైక్యాంధ్ర ఉద్యమం చూస్తుంటే నాడు గాంధీ చేపట్టిన స్వాతంత్య్ర పోరాటం గుర్తుకు వస్తోందన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, కార్మికులు ఉద్యమాన్ని భుజాన వేసుకుని అలుపెరుగకుండా యూపీఏ సర్కారు మెడలు వంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. నాడు ఇందిరా గాంధీ, నెహ్రూలు విభజన వల్ల వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సమైఖ్యతకు కృషి చేశారన్నారు. నేడు ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ తన స్వార్థ ప్రయోజనాల కోసం సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు పూనుకుందని విమర్శించారు. రాష్ట్ర విభజన ప్రకటన ఆగేవరకూ ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు రావడంతో సమైక్యాంధ్ర ఉద్యమానికి కొత్త ఊపు వచ్చిందన్నారు. త్వరలోనే జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించే నాయకుడు అవుతారని అన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జేఏసీ నాయకులు కొండేపాటి రామకృష్ణ, ఆరేటి సత్యనారాయణ, కలగర రాము, రేపాకుల చంద్రం, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మొడియం గంగరాజు, పాయం పోసియ్య, కుంజా పోసియ్య తదితరులు పాల్గొన్నారు.
టీ నోట్‌ను అసెంబ్లీలో తిరస్కరిస్తాం
Published Sat, Sep 28 2013 12:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement