సాక్షి, హైదరాబాద్ / విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్‌లో గత రాత్రి నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అంతే కాకుండా రోడ్లపై నీరు చేరి గుంతలు పడటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందలకు గురయ్యారు.
ఇక ఏపీ విషయానికి వస్తే విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మొత్తం మబ్బులతో ముసురు కప్పేసింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. వాటితో పాటు రానున్న 48 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని కారణంగా ఈ నెల 16న మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.
అల్ప పీడనాల కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉత్తర తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55-60 కిలోమీటర్లు, ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment