నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 12 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 639 ఇంజనీరింగ్ కాలేజీల్లో 2,24,000 సీట్లు అందుబాటులో ఉన్నట్టు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. కళాశాలల వారీగా ఫీజుల వివరాలను కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు తెలిపింది. విద్యార్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుంచి గానీ, ఎంసెట్ సహాయక కేంద్రం నుంచి గానీ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వాటిని మార్చుకోవాలనుకుంటే ఈనెల 13, 14 తేదీల్లో మార్చుకోవచ్చు.
13న 1వ ర్యాంకు నుంచి లక్ష వరకు, 14న 1,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులు ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెల్లడిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 23న కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేరోజు తరగతులు ప్రారంభమవుతాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఇప్పటివరకు 1,29,734 మంది హాజరయ్యారు. వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగుతుంది. మంగళవారంనాటికి కూడా హాజరుకాలేకపోయిన వారు ఈనెల 12 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై, స్క్రాచ్ కార్డు పొంది, అక్కడే సహాయక కేంద్రంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది.
ఫీజులను గమనించాలి..
విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసే ముందు కళాశాలల నాణ్యతతోపాటు, వాటిలో ఫీజులను గమనించాల్సిందిగా ఉన్నత విద్యామండలి వర్గాలు సూచించాయి. కళాశాలల ఫీజులు రూ.30 వేల నుంచి రూ.1,13,000 వరకు వేర్వేరుగా ఉన్నందున ఫీజులు భరించే స్తోమతను బట్టి కళాశాలలను ఎంపికచేసుకోవాలని తెలిపాయి. ప్రభుత్వం 259 కళాశాలలకు రూ.35 వేలుగా, 175 కళాశాలలకు రూ.35,500 నుంచి రూ.1,13,300గా ఫీజులు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వ్యయ నివేదికలు ఇవ్వని 195 కళాశాలలకు మాత్రం సెప్టెంబర్ 30 లోగా ఆన్‌లైన్‌లో నివేదికలు సమర్పించాలన్న షరతుతో అడ్‌హాక్ ఫీజుగా రూ.30 వేలు ఖరారు చేసింది. ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.35 వేలు పొందుతారు. వీటితో పాటు, హాస్టల్ ఫీజులు, రవాణా వ్యయాలు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకుంటే మంచిదని మండలి వర్గాలు పేర్కొన్నాయి.
సీఎం వద్దకు ‘బీ-కేటగిరీ’..
యాజమాన్య కోటా సీట్ల భర్తీ అంశం ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ఆగస్టు 13న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడినప్పటికీ.. హైకోర్టు ధర్మాసనం ఈ సీట్లను జీవో 66కు లోబడి ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని ఆదేశించింది. అయితే అప్పటికే వెలువడిన నోటిఫికేషన్‌ను కొనసాగించాలా? లేక తాజా తీర్పు అమలు చేయాలా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ ఉన్నత విద్యామండలి ఉన్నత విద్యాశాఖను కోరింది. దీనిపై తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతూ సీఎంకు ఉన్నత విద్యాశాఖ సోమవారం సంబంధిత ఫైలును పంపింది.